Haryana results: హరియాణా ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమన్న కాంగ్రెస్; ఈవీఎంలపై అనుమానం
హర్యానా ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయి పరిస్థితులకు వ్యతిరేకంగా ఫలితాలు ఉన్నాయని పేర్కొంది. ఈసీఐ వెబ్సైట్లో ఎన్నికల డేటా అప్డేట్ మందకొడిగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ఎన్నికల ఫలితాలు షాక్ ను ఇచ్చాయి. దాంతో, ఈ ఫలితాలను తాము అంగీకరించబోమని కాంగ్రెస్ తెలిపింది. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నట్లుగా ఉన్న పరిస్థితులకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించింది.
మేం ఒప్పుకోం..
‘‘హరియాణా (haryana) లో ఫలితాలు పూర్తిగా ఊహించనివి, పూర్తిగా ఆశ్చర్యకరమైనవి, ప్రతికూలమైనవి. ఇది గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధం. మార్పు, పరివర్తన కోసం హరియాణా ప్రజలు తమ ఆలోచనలను మార్చుకున్న దానికి ఇది విరుద్ధం. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ప్రకటించిన ఫలితాలను ఆమోదించడం సాధ్యం కాదు’’ అని కాంగ్రెస్ (congress) ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ‘‘కౌంటింగ్ ప్రక్రియ, కనీసం మూడు జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు అందాయి. ఇంకా చాలా వస్తున్నాయి. హరియాణాలోని తమ సీనియర్ సహచరులతో మాట్లాతున్నం. మరింత సమాచారాన్ని సేకరిస్తున్నాం’’ అని జైరాం రమేశ్ చెప్పారు.
ఈసీపై ఫిర్యాదు
రేపు లేదా మరుసటి రోజు ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను సమర్పిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ‘‘మా అభ్యర్థులు తీవ్రమైన అనుమానాలు లేవనెత్తారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజు హరియాణాలో మనం చూసినది నిజమైన విజయం కాదు. ఇది తారుమారు చేసిన విజయం. ప్రజల సంకల్పాన్ని భ్రష్టు పట్టించే విజయం. ఇది పారదర్శక ప్రజాస్వామిక ప్రక్రియలకు ఓటమి’’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. ఈవీఎంలపై హిసార్, మహేంద్రగఢ్, పానిపట్ జిల్లాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు, కార్యకర్తలు నిరంతరం ఫిర్యాదులు చేస్తన్నారని తెలిపారు.