AP Elections: వ్యవస్థల వైఫల్యం.. ఎన్నికల సంఘానిదే అసలు బాధ్యత, లోపం ఎక్కడో తెలిసినా చర్యలు కరువు..
AP Elections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన పరిణామాలకు అసలు బాధ్యత ఎవరిదనే ప్రశ్న పక్కదారి పడుతోంది. వ్యవస్థల వైఫల్యానికి కారణం ఎవరు, మునుపెన్నడు లేని విధంగా అల్లర్లు, హింసాత్మకం కావడానికి కారకులు ఎవరో తేలాల్సి ఉంది.
AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. ఏపీలో నెలకొని ఉన్న హింసాత్మక రాజకీయ వాతావరణానికి, పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు బాధ్యత ఎవరు వహించాలనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశీలకులు, పర్యవేక్షకుల్ని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు పెద్ద ఎత్తున ఉన్నా ఘర్షణలు మాత్రం ఆగలేదు.
పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో ఎన్నికల సంఘం ఆదేశాలతో వందలాది మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అయితే అసలు ఘర్షణలు జరగకుండా ఎన్నికల్ని ఎందుకు నిర్వహించలేకపోయారనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకలేదు.
పల్నాడు జిల్లా మాచర్లలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో జరిగిన గొడవల దృశ్యాలు దాదాపు పది రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఇది కుట్రలో భాగమని వైసీపీ ఆరోపిస్తోంది. 7 బూత్‌లలో ఈవిఎంలను పగులగొడితే ఎమ్మెల్యే దృశ్యాలు మాత్రమే ఎందుకు బయటకు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు.
మరోవైపు EVM ల ధ్వంసం వెబ్ కాస్టింగ్ లో రికార్డు అయ్యిందని సీఈఓ మీనా చెబుతున్నారు. అయితే ఎన్నికల సంఘం తరపున రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, వ్యవస్థలు అన్నింటికి ప్రధాన ఎన్నికల అధికారి సారథ్యం వహిస్తారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన కార్యదర్శి నడిపినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో మాత్రం సీఈఓ అనుమతితోనే సిఎస్ పనిచేయాల్సి ఉంటుంది.
2019 ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటా(కోడ్‌లో పదవి కోల్పోయారు),తర్వాత వచ్చిన ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఎన్నికల సంఘానికి ఇదే తరహా పరిస్థితులు ఎదురైనపుడు ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా సీఈసీ అనుమతితోనే ఏ నిర్ణయమైనా జరగాలని తేల్చి చెప్పింది.
ఏపీలో ప్రభుత్వ యంత్రాంగాలను నడిపించే ముఖ్యమైన అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించరంటూ విపక్షాలు ఎన్నికలకు ముందు నుంచి ఫిర్యాదు చేశాయి. అధికార పక్షానికి సహకరిస్తున్న వారి జాబితాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు. అయితే కొందరు అధికారుల్ని అదృశ్య శక్తులు కాపాడాయనే విమర్శలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వ యంత్రాంగం సహకరించలేదా..?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ఎన్నికల అధికారిగా ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. ఆయన సౌమ్యుడు, సమర్థుడిగా గుర్తింపు పొందారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టడానికి ముందు గవర్నర్ కార్యదర్శిగా పనిచేశారు. అనూహ్య కారణాలతో ఆయన్ని గవర్నర్ కార్యాలయం నుంచి తప్పించారనే ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
ముఖేష్ కుమార్ మీనా సౌమ్యుడు కావడంతో పాటు ఇతర కారణాలతో ప్రభుత్వాన్ని నడిపించే ముఖ‌్యమైన వ్యక్తులు ఆయన్ని ఖాతరు చేయలేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ యంత్రాంగాలను ప్రధానంగా సామాజిక హోదాలు ప్రభావితం చేస్తాయనే అపప్రద ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల సమయంలో కూడా ఇవి వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితంచ చేశాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో ఉన్న కులాధిపత్య ధోరణి ప్రభుత్వ యంత్రాంగాల మీద ఎప్పుడు ప్రభావం చూపుతూనే ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మాచర్లలో జరిగిన పరిణామాలు మొత్తం నిఘా వర్గాలు పోలింగ్ రోజే నివేదించినా వాటిపై చర్యలు తీసుకోడానికి మాత్రం వ్యవస్థలు సాహసించలేదు.
అందరూ ఉన్నా ఆగలేదు…
మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ప్రత్యక్షంగా ఉన్న సిబ్బందితో పాటు పార్టీల ఏజెంట్లు కూడా ఉన్నారు. ఈవిఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేస్తుండగా టీడీపీ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అతనిపై దాడి జరిగింది.
మరోవైపు ఏపీలోని అత్యంత సమస్యాత్మక నియోజక వర్గాల్లో ఒకటైన మాచర్లలో 100శాతం వెబ్ కాస్టింగ్ చేశామని సీఈఓ చెప్పారు. EVM పగులగొట్టిన వెంటనే బెల్ ఇంజనీర్లు తనిఖీ చేసి కంట్రోల్ యూనిట్ చిప్ సురక్షితంగా ఉందని నిర్ధారించి పోలింగ్ కంటిన్యూ చేసినట్టు సీఈఓ వివరణ ఇచ్చారు.
EVM పగులగొట్టింది ఎవరు అనేది బూత్‌లో ఉన్న వారు ఎవరు చెప్పలేదనుకున్నా, వెబ్ కాస్టింగ్ లో ఖచ్చితంగా రికార్డు అవుతుందని ఎన్నికల సంఘం తరపున విధులు నిర్వర్తించిన వారికి తెలియదని భావించలేము.
ప్రతి జిల్లాలో ఆర్వోల స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఉన్నాయి. 13తేదీ గొడవ విజువల్ బయటకు రావడానికి 10రోజులు ఎందుకు పట్టిందనే సమాధానం ఇప్పటికీ దొరకలేదు. 20వ తేదీన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన తర్వాత వీడియోలు బయటకు వచ్చినట్టు సీఈఓ చెబుతున్నారు.
ఎమ్మెల్యే స్వయంగా విధ్వంసానికి పాల్పడటంపై కేంద్ర ఎన్నికల CEC ఒత్తిడి చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తించే పరిస్థితిలో లేకపోవడం గుర్తించాల్సి ఉంది.
ఏపీలో జరిగిన అల్లర్లపై SIT దర్యాప్తు మొదలయ్యాక 20వ తేదీ సాయంత్రం ఎంఎల్ఏ మీద కేసు నమోదు అయ్యిందని సీఈఓ చెప్పారు. మిగిలిన బూత్‌లలో జరిగిన ఘర్షణల విజువల్ ఎందుకు బయటకు రాలేదనే దానిపై వివరణ లేదు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున రాష్ట్రంలో విధులు నిర్వర్తించే అధికారుల్ని నియంత్రించే రిమోట్ మరో చోట ఉండటమే దీనికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ బూత్ సిబ్బంది నిర్వాకం, మైక్రో అబ్జర్వర్ల వైఫల్యం, ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడంలో జరిగిన వైఫల్యాలే ప్రస్తుత పరిణామాలకు కారణమని అధికారులు చెబుతున్నారు.
పోలింగ్ సిబ్బందిపై వేటు…
మరోవైపు బూత్‌లో ఎమ్మెల్యే ఈవిఎం పగులగొట్టిన విషయాన్ని నివేదించని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పిఓతో పాటు మొత్తం సిబ్బందిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన సమయం లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ లో అడుగు పెట్టగానే విధుల్లో ఉన్నపోలింగ్ ఆఫీసర్‌తో పాటు ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేశారు. అంటే వారు ఎమ్మెల్యేను గుర్తించారు. ఆ తర్వాత ఫిర్యాదులో మాత్రం ఎవరు ధ్వంసం చేశారో చూడలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాడిని అడ్డుకోవడంలో విఫలమైనందుకు సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. గురువారంలోగా సిబ్బంది సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
“ఛలో మాచర్ల "కు అనుమతి లేదు…
TDP తలపెట్టిన “ ఛలో మాచర్ల " కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ ప్రకటించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున TDP రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సదరు ప్రోగ్రామ్ కి పాల్గొనటం, హాజరవటం, ర్యాలిగా వెళ్లే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టపరమైన మరియు కఠిన చర్యలు తీసుకుంటామని, పల్నాడు జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
సంబంధిత కథనం