Vinesh Phogat wins: ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగాట్.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం-vinesh phogat wins in haryana elections bjp candidate yogesh bairagi loses ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Vinesh Phogat Wins: ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగాట్.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం

Vinesh Phogat wins: ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగాట్.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం

Hari Prasad S HT Telugu

Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. పారిస్ ఒలింపిక్స్ లో ఊహించని రీతిలో అనర్హత వేటుకు గురై మెడల్ కోల్పోయిన ఆమె.. ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం విజయం సాధించడం గమనార్హం.

ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగాట్.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం

Vinesh Phogat: ఒలింపిక్స్ మెడల్ గెలవలేకపోయినా.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయింది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున విజయం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత గత నెలలోనే కాంగ్రెస్ లో చేరిన ఆమె.. అప్పుడే ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోయింది.

వినేశ్ ఫోగాట్ విజయం

వినేశ్ ఫోగాట్ మొత్తానికి నవ్వింది. పారిస్ ఒలింపిక్స్ లో అనూహ్యంగా ఫైనల్ కు ముందు అనర్హత వేటుకు గురై.. కచ్చితంగా వస్తుందనుకున్న మెడల్ మిస్సయినా ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో విజయం ఆమెకు ఊరట కలిగించింది. హర్యానాలోని జింద్ జిల్లాలో ఉన్న జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వినేశ్.. బీజేపీ అభ్యర్థి, మాజీ ఇండియన్ ఆర్మీ కెప్టెన్, పైలట్ అయిన యోగేశ్ భజరంగీపై గెలిచింది.

వినేశ్ 6 వేల ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం. తొలి రౌండ్లలో ఆమె వెనుకబడినా తర్వాత పుంజుకుంది. హర్యానా నుంచి రాజకీయాల్లో చేరి, ఎన్నికల్లో పోటీ పడిన తొలి మహిళా రెజ్లర్ గా రికార్డు సొంతం చేసుకున్న వినేశ్.. ఇప్పుడీ విజయంతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది.

వినేశ్ ప్రత్యర్థి యోగేశ్ ఇలా..

ఈ ఎన్నికల్లో వినేశ్ పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి యోగేశ్ కూడా మామూలు వ్యక్తేమీ కాదు. అతడు గతంలో ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ గా చేశాడు. తర్వాత కమర్షిషల్ పైలట్ గా విధులు నిర్వహించాడు.

35 ఏళ్ల యోగేశ్.. కొవిడ్ మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేకాదు చెన్నై వరదల సమయంలోనూ బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం అతడు హర్యానా బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు.

వినేశ్ జర్నీ ఇలా..

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వినేశ్ విజయం సాధించినా.. ఆమె పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. హర్యానాలో మరోసారి బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 49 సీట్లు ఆ పార్టీ సొంతం కానున్నాయి.

ఇక వినేశ్ ఫోగాట్ విషయానికి వస్తే గతేడాది రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల్లో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ లోనూ ఆమె మెడల్ కచ్చితంగా గెలిచేలా కనిపించింది.

ఫైనల్ కు చేరి కనీసం సిల్వర్ ఖాయం చేసినా.. అదే ఫైనల్ రోజు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా అనర్హత వేటుకు గురైంది. మెడల్ కోల్పోయి ఇండియాకు వచ్చిన వినేశ్ కు ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఆమె రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది.