Maharashtra Election 2024 : 'మహా'పోరు నేడే.. 288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు
20 November 2024, 6:41 IST
- Maharashtra Assembly Election 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డే వచ్చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మెుదలైంది. సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. 288 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మరో దఫా అధికారంపై కన్నేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి అగ్రనేతలతో కూడిన హై ఓల్టేజ్ ప్రచారాలు ఈ ఎన్నికలలో జరిగాయి. ఎలాగైనా మహాపోరులో గెలవాలని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అనుకుంటున్నాయి. ఈ మేరకు కూటమితో కలిసి ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం)తో కూడిన ఎంవీఏ, కుల ఆధారిత జనాభా లెక్కలు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలపై దృష్టి సారించడం ద్వారా బీజేపీ ప్రచారాన్ని ప్రతిఘటించింది.
మహాయుతి పోటీ చేస్తున్న స్థానాలు
బీజేపీ: 149
శివసేన (షిండే): 81
ఎన్‌సీపీ (అజిత్ పవార్): 59
ఎంవీఏ పోటీ చేస్తున్న సీట్లు
కాంగ్రెస్: 101
శివసేన (UBT): 95
ఎన్‌సీపీ (శరద్ పవార్): 86
మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్(ఎఐఎంఐఎం)తోపాటుగా పోటీలో ఉన్న చిన్న పార్టీలు ఉన్నాయి. బీఎస్పీ 237 స్థానాల్లో, ఏఐఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2,086 మంది స్వతంత్రులతో సహా 4,136 మంది వ్యక్తులు పోటీ చేయడంతో ఈ సంవత్సరం అభ్యర్థుల సంఖ్యలో 28 శాతం పెరుగుదల కనిపించింది. 150 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో మహాయుతి, ఎంవీఏ కూటమిల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు.
6,101 మంది ట్రాన్స్‌జెండర్లు, 6.41 లక్షల మంది దివ్యాంగుల ఓటర్లతో సహా 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 1,00,186 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 2019తో పోల్చుకుంటే ఇది 4 శాతం పెరుగుదల. దాదాపు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్‌ను పర్యవేక్షిస్తారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అక్టోబర్ 15 నుండి అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి నుండి అధికారులు రూ. 252.42 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.83.12 కోట్ల విలువైన లోహాలు, రూ. 32.67 కోట్ల డ్రగ్స్ ఉన్నాయి. ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్ ద్వారా మోడల్ కోడ్ ఉల్లంఘనలపై 2,469 ఫిర్యాదులను స్వీకరించింది. వాటిలో 99.31 శాతం వెంటనే పరిష్కరించింది.