Uddhav Thackeray: మహా వికాస్ అఘాడిని ప్రజలు స్వాగతించారన్న ఉద్ధవ్
మహా వికాస్ అఘాడిని ప్రజలు స్వాగతించారని మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. తాను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ముంబై, జూలై 27: మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి ప్రయోగం తప్పు కాదని, ప్రజలు దానిని స్వాగతించారని శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం అన్నారు.
శివసేన పత్రిక 'సామ్నా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ప్రస్తావించారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
శివసేనకు మరోసారి సొంత ముఖ్యమంత్రి ఉంటారని పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌ను పునరుజ్జీవింపజేయడానికి రాష్ట్రమంతటా తాను పర్యటిస్తానని ప్రకటించారు.
ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి బీజేపీ.. ముఖ్యమంత్రి సహా అనేక పదవులు ఇస్తోందని ఠాక్రే అన్నారు.
‘శివసేన వర్సెస్ శివసేన పోరాటాన్ని ప్రేరేపించాలని, మరాఠీ మాట్లాడే ప్రజలను విభజించాలని ఢిల్లీ కోరుకుంటోంది. ప్రస్తుత పాలకులు ప్రతిపక్షాలకు భయపడితే, అది వారి అసమర్థతే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ శాశ్వత విజేత కాదు..’ అని ఆయన అన్నారు.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని పంచుకునే అంశంపై శివసేన బీజేపీకి దూరమైంది. ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంవీఏలో భాగంగా ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జతకట్టింది.
గత నెలలో శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేతో పాటు 39 మంది ఇతర పార్టీ శాసనసభ్యులు, కొంతమంది స్వతంత్రులు శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.
జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.
‘ప్రజలు ఎంవీఏ ప్రయోగాన్ని స్వాగతించారు’ అని థాకరే అన్నారు. తనకు ఇచ్చిన హామీని బీజేపీ తిరస్కరించడం నుండి మూడు పార్టీల కూటమి పుట్టిందని అన్నారు.
‘శివసేన నేత మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. పార్టీ బేస్, క్యాడర్‌ను విస్తరించడానికి నేను కృషి చేస్తాను. నేను ఆగస్టు నుండి రాష్ట్ర పర్యటనను ప్రారంభిస్తాను…’ అని సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
'2019లో నేను బీజేపీని ఏం అడిగాను?.. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి. అందుకు అంగీకారం కుదిరింది. పోస్ట్ నా కోసం కాదు. నేను శివసేన అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని బాలాసాహెబ్‌కి వాగ్దానం చేశాను. నా హామీ ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది..’ అని అన్నారు.
‘ఆయన (షిండే) ముఖ్యమంత్రి పదవిని చాలా దారుణంగా తెచ్చుకున్నారు. అధికార వ్యామోహంతో ఇప్పుడు తనను తాను శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రేతో పోల్చుకుంటున్నారు..’ అని శివ సేన అధ్యక్షుడు అన్నారు.
షిండేను సీఎం కావాలనుకుంటున్నారా అని తాను అడిగానని ఉద్ధవ్ థాకరే చెప్పారు. ‘బీజేపీతో కలిసి వెళ్లాలనుకుంటే, ఆ పార్టీ కోసం నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.. వాటికి సమాధానాలు ఇవ్వండి. కానీ ఆయనకు (షిండే) దమ్ము లేదు’ అని మాజీ సీఎం అన్నారు.