Mlc Elections In AP : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రేపే లాస్ట్, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇదే
Mlc Elections In AP : ఏపీలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఏపీ సీఈవో వెబ్ సైట్లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఎమ్మార్వో ఆఫీసులో సబ్మిట్ చేయవచ్చు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన పట్టభద్రులు నవంబరు 6 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో పట్టభద్రుల నుంచి ఫారం-18 ద్వారా ఓటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఓటర్ల నమోదు పూర్తైన తర్వాత నవంబరు 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేస్తారు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 9 వరకు మళ్లీ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిపై డిసెంబర్ 25 తేదీకి స్క్రూటినీ పూర్తి చేసి, ఆ నెల 30న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. అనంతరం పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఫారం-18 ద్వారా పట్టభద్రుల ఓటర్ల తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేసిన డిగ్రీ సర్టిఫికేట్ నకలు జోడించాలి. అలాగే రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా ఫారం-18పై అతికించాలి. దీంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి సర్టిఫికేట్, ఓటర్ ఐడీ జిరాక్స్ లను జత చేయాలి. అన్ని కలెక్టరేట్‌లలో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తో పాటు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఎంఈవో ఆఫీసులలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
https://ceoandhra.nic.in/ceoap_new/ceo/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనూ ఓటు నమోదు చేసుకోవచ్చు. ఎన్నికల జరిగే ప్రాంతంలో నివాసిగా ఉండి నవంబరు 1, 2024 నాటికి మూడేళ్లు ముందు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఓటర్లుగా నమోదుకు అర్హులు. 2025 మార్చి 29తో పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తవుతుంది.
పట్టభద్రుల ఓటు నమోదు ఆన్ లైన్ విధానం
- గ్రాడ్యూయేట్ ఓటు కోసం ఓటర్లు https://ceoandhra.nic.in/ceoap_new/ceo/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని MLC-e Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత గ్రాడ్యూయేట్-18 ఆప్షన్ పై నొక్కాలి.
- ఓటర్ ప్రాథమిక వివరాలతో Sign-Up చేయాలి.
- ఆ తర్వాత ఫారం- 18పై క్లిక్ చేయాలి.
- ఏ గ్రాడ్యూయేట్ నియోజకవర్గం కిందికి వస్తారో అక్కడ క్లిక్ చేయాలి.
- ఓటర్ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. విద్యార్హత పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరిగా సబ్మిట్ పై నొక్కితే అప్లికేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తో మీ అప్లికేషన్ ను ట్రాక్ చెక్ చేసుకోవచ్చు.
అయితే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల వివరాల వీఆర్వో వద్దకు వస్తాయి. అనంతరం ఓటర్... తమ డిగ్రీ, ఎస్ఎస్సీ, ఓటర్ ఐడీ, ఆధార్ జిరాక్స్ పై గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేసి వీఆర్వోకు అందించాలి. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకున్న వారు ఈ పత్రాలు, ఫారం-18 ను ఎమ్మార్వో ఆఫీసులో పెట్టిన బాక్స్ లో వేయవచ్చు.
సంబంధిత కథనం