exit poll 2024: ‘‘మూడో సారి కూడా మోదీనే.. ఎన్డీయే గెలుపు ఖాయమే’’; మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇదే
01 June 2024, 20:39 IST
exit poll 2024: ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న ముగిసింది. సాయంత్రం 6.30 గంటల నుంచి న్యూస్ ఛానళ్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మరోసారి ఓటర్లు మోదీ నాయకత్వానికే ఓటు వేశారని అంచనా వేస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి..
exit poll 2024: 2024 ఎగ్జిట్ పోల్స్ పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఏడు దశల మారథాన్ పోలింగ్ ప్రక్రియ జూన్ 1 శనివారంతో ముగిసింది. జూన్ 1న ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత, శనివారం సాయంత్రం 6.30 నుంచి వివిధ సంస్థలు, న్యూస్ చానళ్లు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడిస్తున్నాయి. వాటిలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, ఏబీపీ- సీ-ఓటర్, న్యూస్ 24-టుడేస్ చాణక్య, రిపబ్లిక్ టీవీ- పీఎంఏఆర్క్యూ-మ్యాట్రిజ్, టైమ్స్ నౌ- బుల్స్ ఐ, ఎన్డీటీవీ ఇండియా- జన్ కీ బాత్, టీవీ9 భారతవర్ష్- పోల్స్టార్ట్ తదితర జాతీయ న్యూస్ ఛానళ్లు, ఏజెన్సీలు ఉన్నాయి.
ఎన్నికల సంఘం ప్రకటన
కాగా, 2024 లోక్ సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలిపింది.ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ లో చివరి దశ పోలింగ్ జరిగింది. ఈసీఐ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు 60.14 శాతం ఓటింగ్ తో చివరి దశలో జార్ఖండ్ ముందంజలో ఉంది. బీహార్, చండీగఢ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏడో దశలో పోలింగ్ జరిగింది.
ఎన్డీయే గెలుపు ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్ ఇవే..
కాగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ- పీ మార్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఎన్డీయే కు 359 సీట్లు, ఇండియా కూటమికి 154 సీట్లు, ఇతరులకు 30 సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే, ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు ఈ ఎన్నికల్లో 371 స్థానాలు, ఇండియా కూటమికి 125 సీట్లు వస్తాయి. ఇతరులు 35 నుంచి 45 సీట్లు గెల్చుకుంటారు. ఎన్డీటీవీ ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఎన్డీయే విజయాన్నే అంచనా వేసింది. ఎన్డీటీవీ ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఈ ఎన్నికల్లో ఎన్డీయే 365 సీట్లలో, ఇండియా కూటమి 142 స్థానాల్లో, ఇతరులు 36 సీట్లలో విజయం సాధిస్తాయి.
తమిళనాడులో ఇండియా కూటమి
మరోవైపు, తమిళనాడు ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తమిళనాడులో ఇండియా కూటమికి 26 నుంచి 30 సీట్లు వస్తాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 1 నుంచి 3 సీట్లు రావచ్చు. ఇతరులు 5 నుంచి 6 సీట్లలో గెలుపొందవచ్చు. అయితే, కర్నాటకలో ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపిస్తోందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. కర్నాటకలో బీజేపీ 23 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లు గెల్చుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ కు కాస్త ఊరట లభిస్తుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. పంజాబ్ లోని మొత్తం 13 స్థానాల్లో కాంగ్రెస్ కు 7 నుంచి 9 సీట్లు వస్తాయని వెల్లడించింది.