Lok Sabha elections 2024: 57 సీట్లు, 10 కోట్ల ఓటర్లు: రేపే లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్
Lok Sabha elections 2024: భారత్ లో లోక్ సభ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో తుది దశ అయిన ఏడో విడత పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. ఈ దశలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
రేపే తుది దశ పోలింగ్
జూన్ 1న అంటే రేపు ఏడో, చివరి దశ పోలింగ్ తో లోక్ సభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏడు రాష్ట్రాల్లోని 56 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ లోని ఒక నియోజకవర్గంలో చివరి రౌండ్ పోలింగ్ జరగనుంది.
కీలక స్థానాలు
ఏడో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసి కూడా ఉంది. అలాగే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ తదితరులు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా రేపు పోలింగ్ జరగనుంది.
సంఖ్యల్లో ఏడో దశ
- పోలింగ్ జరిగే 57 సీట్లలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, మూడు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.
- ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
- ఈ దశలో 1.09 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10.9 లక్షల మంది అధికారులు పోలింగ్ విధుల్లో ఉన్నారు.
- ఓటర్లలో 5.42 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
- పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు ఎన్నికల సంఘం 13 ప్రత్యేక రైళ్లు, 8 హెలికాప్టర్లను రంగంలోకి దించింది.
- ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి 172 మంది పరిశీలకులను నియమించారు.
- మొత్తం 2707 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2799 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 1080 నిఘా బృందాలు, 560 వీడియో వ్యూయింగ్ బృందాలు 24 గంటలూ నిఘా ఉంచుతాయి.
- 201 అంతర్జాతీయ సరిహద్దు చెక్ పోస్టులు, 906 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల ద్వారా మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఉచితాల అక్రమ ప్రవాహాన్ని నిరోధించడానికి గట్టి నిఘా నిర్వహిస్తున్నారు.