తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024 : ఖమ్మంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ హెలికాప్టర్ తనిఖీ

Lok Sabha Elections 2024 : ఖమ్మంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ హెలికాప్టర్ తనిఖీ

19 April 2024, 19:08 IST

google News
    • BJP Election Campaign in Khammam : ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్ రావు నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హెలికాప్టర్ లో రాగా… ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
ఖమ్మంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హెలికాప్టర్ తనిఖీ
ఖమ్మంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హెలికాప్టర్ తనిఖీ

ఖమ్మంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హెలికాప్టర్ తనిఖీ

BJP Election Campaign in Khammam : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Union Defense Minister Rajnath Singh) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఖమ్మంలో ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్ రావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ శుక్రవారం ఖమ్మం వచ్చారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్ నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో దిగింది. కాగా ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన అనంతరం రక్షణ మంత్రి హెలికాప్టర్ ను ఎన్నికల అధికారులు కొద్ది సమయం పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి కస్తాల సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్ లోని అణువణువునూ నిశితంగా పరిశీలించారు. సుమారు అరగంట పాటు అధికారులు ఈ తనిఖీలను చేపట్టారు. జిల్లా శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ సైతం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కాగా హెలికాప్టర్ లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని వారు వెల్లడించారు.

నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్…

నామినేషన్ల కార్యక్రమానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఖమ్మం బీజేపి ఎంపీ(Khammam Lok Sabha Election 2024) అభ్యర్థి తాండ్ర వినోద్ రావు(Tandra Vinod Rao) శుక్రవారం నామినేషన్ వేసేందుకు సమాయత్తం అయ్యారు. ఆయన నామినేషన్ ప్రక్రియకు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ హాజరవడం ఒకింత అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం రాజకీయ వర్గాల్లో సైతం చర్చకు దారితీసింది. జిల్లాలో బీజేపీ ప్రభావం ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే చాలా తక్కువ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పది నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు అంతంత మాత్రమే. అయితే ఆధ్యాత్మిక నేపధ్యం కలిగిన కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడం, నామినేషన్ దాఖలుకు కేంద్ర రక్షణ మంత్రి వంటి ప్రముఖుడు సైతం హాజరవ్వడం చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో పార్టీ ప్రాభవాన్ని పెంచాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థి తాండ్ర వినోద రావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకునే ముందు ఖమ్మం నగరంలో భారీ వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజ్నాథ్ సింగ్ పాల్గొని కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేయడం ఆసక్తిని కలిగించింది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

 

తదుపరి వ్యాసం