Rajnath Singh: ‘ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు కూడా హాజరు కానివ్వలేదు’ - రాజ్ నాథ్ సింగ్-didnt get parole for my mothers last rites during emergency rajnath singh ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rajnath Singh: ‘ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు కూడా హాజరు కానివ్వలేదు’ - రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: ‘ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు కూడా హాజరు కానివ్వలేదు’ - రాజ్ నాథ్ సింగ్

HT Telugu Desk HT Telugu
Published Apr 11, 2024 06:25 PM IST

బీజేపీ పాలనను నియంత పాలన అంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ పై బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. అత్యవసర స్థితి విధించిన కాంగ్రెస్ పాలనను మించిన నియంత పాలన మరొకటి ఉండదన్నారు. చైనాతో సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మండిపడ్డారు.

బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (ANI file)

భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను నియంతలుగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు.1975లో తనను 18 నెలల పాటు జైలుకు పంపిన ఎమర్జెన్సీని ఆయన గుర్తు చేశారు.

తల్లి అంత్యక్రియలకు హాజరు కానివ్వలేదు

కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ సమయంలో.. తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని రాజ్ నాథ్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్ ఇవ్వమని కోరగా, నిరాకరించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారు (కాంగ్రెస్) మమ్మల్ని నియంతలు అంటున్నారని రక్షణ మంత్రి ఎద్దేవా చేశారు. బ్రెయిన్ హెమరేజ్ కు చికిత్స పొందుతూ 27 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమెను చివరి రోజుల్లో కూడా కలవలేకపోయానని రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తానాషాహీ లేదా నియంతృత్వ పాలన సాగిస్తోందన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. ఎమర్జెన్సీ ద్వారా నియంతృత్వాన్ని విధించిన వ్యక్తులు తమపై నియంతృత్వ ఆరోపణలు చేస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

చైనా సరిహద్దులపై..

చైనాతో సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీపై రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భారత్ కు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ‘‘అంగుళం భూమిని కూడా వదులుకోబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం’’ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేయగలదా అని ఆయన ప్రశ్నించారు. వారి పాలనలో ఏం జరిగిందో, ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల భూమి చైనా (china) ఆధీనంలోకి వెళ్లిందో చరిత్రలో ఉందన్నారు.

పాకిస్తాన్ కు సాయం చేస్తాం

ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పాకిస్తాన్ అశక్తత వ్యక్తం చేస్తే, భారత్ పాక్ లో ఉగ్రవాద నిర్మూలనకు సాయం చేస్తుందని రాజ్ నాథ్ సింగ్ మరోసారి ఆఫర్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరుకు పాకిస్తాన్ కు సాయం చేస్తామని ఆయన (Rajnath Singh) హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ‘‘కానీ, ఉగ్రవాదం సాయంతో భారత్ ను అస్థిరపరిచేందుకు పాక్ ప్రయత్నిస్తే దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదాన్ని నియంత్రించే సత్తా తమకు లేదని పాక్ భావిస్తే భారత్ సాయం తీసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అన్నారు. భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులను అనుమతించబోమన్నారు. దాన్ని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

Whats_app_banner