Khammam BJP : ఖమ్మంలో బీజేపీ బలమెంత? ఎంపీ అభ్యర్థి తాండ్రకు పరీక్షే!
10 April 2024, 22:23 IST
- Khammam BJP : కాంగ్రెస్ కంచుకోటైన ఖమ్మంలో బీజేపీని ఓటర్లు ఎంత పట్టించుకుంటారోన్న సందేహం కలుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నోటాతో పోటీ పడిన బీజేపీ... లోక్ సభ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుందో వేచిచూడాలని విశ్లేషకులు అంటున్నారు.
ఎంపీ అభ్యర్థి తాండ్రకు పరీక్షే!
Khammam BJP : కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా, అనేక చారిత్రక పోరాటాలకు పురిటిగడ్డగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) కంచుకోటగా నిలిచిన ఖమ్మంలో కమల వికాసం సాధ్యమేనా? రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలో బీజేపీకి ఓట్లు రాలేనా? నాలుగు నెలల కిందట 2023 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజీపీతో పాటు బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు పరిశీలిస్తే ఒక్కరికి కూడా డిపాజిట్లు దక్కని పరిస్థితి నెలకొంది. కేవలం నోటాకు దగ్గరగా పోలైన ఓట్లతో కుదేలైన బీజేపీ, జనసేన(BJP Janasena) ఏ మేరకు ప్రస్తుత పార్లమెంటులో మనుగడ సాగిస్తాయో వేచి చూడాలి. ఇక ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోలైన ఓట్లను ఒకసారి పరిశీలిస్తే బీజేపీ బలమెంతో తేటతెల్లం అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్ర పక్ష పార్టీ అభ్యర్థులకు 7,28,293 ఓట్లు రాగా, ఆ తరువాత బీఆర్‌ఎస్(BRS) పార్టీ అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లో కలిపి 4,67,639 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ, మిత్రపక్ష పార్టీ అయిన జనసేన పార్టీ అభ్యర్థులకు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కేవలం 16,696 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీన్ని బట్టి ఏడు నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా కనీసం ఓట్లను రాబట్టుకోలేకపోయారు. అంతేకాదు.. దాదాపు నోటా ఓట్లకు దగ్గరగా ఓట్లు వచ్చాయంటే బీజేపీ బలమెంతో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఏటికి ఎదురీదుతున్న తాండ్ర?
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత లోక్‌సభ పక్షనేత, ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageswararao) బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు నెలన్నర కిందటే ఎంపీగా నామనాగేశ్వరరావు పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ప్రకటించారు. ప్రస్తుతం ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ నామ నాగేశ్వరరావు తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. గత రెండు సార్లు ఎంపీగా గెలిచిన నామ నాగేశ్వరరావు రెండు సార్లు కూడా అత్యుత్తమ విజయాలను నమోదు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఏఐసీసీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన భారీ విజయాలను బట్టి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు నల్లేరుమీద నడకేనన్న చర్చ జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ టికెట్ (Congress Ticket)కోసం అనేక మంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నేడో, రేపో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారయ్యే సూచనలు మెండుగా ఉన్నాయి. ఇంత హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు తన అదృష్టాన్ని పరిక్షిచుకునేందుకు రంగంలోకి వచ్చారు.
తాండ్ర వినోద్ రావుకు సీనియర్లు హ్యాండ్?
మొదటిగా బీజేపీలోనూ చాలా మంది ఆశావహులే తెరమీదకు వచ్చినా చివరి దశలో జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకే టికెట్ వస్తుందన్న చర్చ జరిగింది. అంతకు ముందు ప్రముఖ వైద్యులు డా.జీవీ(గోంగూరు వెంకటేశ్వర్లు)కు దాదాపు టికెట్ ఖరారైందన్న చర్చ జరిగింది. ప్రసార మాధ్యమాల్లో డా.జీవీ పేరు మార్మోగిపోయింది కూడా. ఉమ్మడి ఖమ్మం(Khammam District) జిల్లాలో దాదాపు నలభై ఏండ్లుగా వైద్యునిగా ఉంటూ మంచి ప్రజా సంబంధాలున్న డా.జీవీ గత పదేండ్లుగా బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్న జీవీకి టికెట్ వస్తే బీజేపీకి కొంత మేలు జరుగుతుందన్న చర్చ జరిగింది. డా.జీవీతో పాటు బీజేపీ ముఖ్య నేతలుగా ఉన్న వారిలో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, దేవకి వాసుదేవరావు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఈవీ రమేష్, తదితరుల్లో స్థానికులున్నందున వారికి టికెట్ వచ్చినా బీజేపీకి మేలు జరుగుతుందన్న చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా తాండ్ర పేరు ఖరారైంది. అప్పటికే రెండు నెలల నుంచి ఖమ్మంలో ఆఫీసు తీసుకుని ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించిన తాండ్రకు టిక్కెట్ రావడంతో ఆశావహులంతా సైలెంటై పోయారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తాండ్రతో పాటు ముఖ్య నేతలు ఎవరూ ప్రచారంలో కలిసి రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. అసలే అంతంత మాత్రం ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు ఎన్నికల్లో ఏ మేరకు ముందుకెళుతుందో అర్దం కాని పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ క్యాడర్(BJP Cadre) అయోమయం వ్యక్తం చేస్తున్నారు.
మిత్ర పక్షం టీడీపీ రెండో వర్గం దారెటు?
జాతీయ స్థాయిలో బీజేపీ, టీడీపీ(BJP TDP ) భాయీభాయీ అని ప్రకటించిన నేపథ్యంలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకు కలిగి ఉన్న టీడీపీ ఖమ్మం పార్లమెంటు పరిధిలో బీజేపీతో కలిసి నడుస్తుందా? లేదా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టీడీపీలో రెండు వర్గాలుండగా, అందులో బీఆర్‌ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు(Nama Nageswararao) సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. ఎంపీగా గెలుపొంది టీడీపీ లోక్‌సభ పక్షనేతగా పని చేసిన అనుభవం ఉంది. స్థానికంగా కాంగ్రెస్‌లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చింది. ఇన్ని అంశాలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి తాండ్ర ఏ మేరకు పోటీ ఇస్తారోనన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని(Chandrababu) అరెస్టు చేసి జైలులో పెట్టినప్పుడు బెయిల్ రాకుండా వైసీపీ చేసిందనీ, అందుకు బీజేపీ సహకారంతోనే ఇలా జరిగిందనీ, తమ నాయకుని ఇబ్బందులు పెట్టిన దాంట్లోనూ బీజేపీ పాత్ర ఉందన్న భావన టీడీపీ శ్రేణులు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థికి మిత్రపక్షాల్లోనూ ఆదరణ ఏ మేరకు ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ దక్కని బీజేపీ అభ్యర్థులు
సరిగ్గా నాలుగు నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు (Khammam Lok Sabha)పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ వాటి మిత్రపక్ష పార్టీలకు పోలైన ఓట్లను పరిశీలిస్తే బీజేపీ బలం స్పష్టమౌతుందన్న చర్చ ఊపందుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలైన వివిధ పార్టీలకు చెందిన ఓట్లను పరిశీలిస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తం సుమారు 16 లక్షల ఓట్లకు గాను కాంగ్రెస్, దాని మిత్ర పక్ష పార్టీ సీపీఐ అభ్యర్థులకు అత్యధికంగా 7,28,293 ఓట్లు రాగా ఆ తరువాత బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లో కలిపి 4,67,639 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ, దాని మిత్రపక్షమైన జనసేనకు కలిపి కేవలం 16,696 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇందులోనూ బీజేపీ ఓట్లను పరిశీలిస్తే మరింత దయనీయంగా ఉంది. ఏడు నియోజకవర్గాల్లోని జనసేన అభ్యర్థులకు 10,978 ఓట్లు రాగా, బీజేపీకి కేవలం 5,798 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే జనసేనతో పోల్చి చూస్తే సగం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.
ఇవీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులకు పోలైన ఓట్లు
మధిర నియోజకవర్గంలో జనసేన(Janasena) మద్దతుగా పోటీ చేసిన అసెంబ్లీ బీజేపీ(BJP) అభ్యర్థి పెరుమాళ్లపల్లి విజయరాజుకు 2021ఓట్లు పోలయ్యాయి. ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన జనసేన అభ్యర్థి మిర్యాల రామకృష్ణకు 4,040 ఓట్లు పోలయ్యాయి. వైరాలో జనసేన తరపున పోటీ చేసిన సంపత్ నాయక్‌కు 2,712 ఓట్లు, పాలేరులో బీజేపీ అభ్యర్థి నున్న రవి కుమార్‌కు 1,815 ఓట్లు, సత్తుపల్లిలో బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావుకు 1,945 ఓట్లు, అశ్వారావుపేట అసెంబ్లీ జనసేన అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవికి 2,281ఓట్లు పోలయ్యాయి. ఇలా బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు రావడం చాలా కష్టమని తెలిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు బరిలో నిలిచి, హేమాహేమీలను ఢీ కొట్టబోతున్న బీజేపీ నేత తాండ్ర వినోద్‌రావుకు(Tandra Vinodrao) అసలైన పరీక్ష మొదలైందన్న చర్చ జరుగుతోంది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి