Medak Loksabha: మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక పోతున్న మూడు ప్రధాన పార్టీలు..
11 March 2024, 12:43 IST
- Medak Loksabha: మెదక్ లోక్‌సభ అభ్యర్థి విషయంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఎటూ తేల్చకోలేకపోతున్నాయి.
మెదక్‌లో లోక్‌సభ అభ్యర్ధి ఎంపికపై తేల్చుకోలేక పోతున్న పార్టీలు
Medak Loksabha: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో, తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు, అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చినా, మెదక్ లోక్ సభ స్థానం నుండి ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారనేది పెద్ద సస్పెన్స్‌గా మిగిలి పోయింది.
గత ఐదు లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ BRS పార్టీ అభ్యర్ధులే గెలిచారు. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి Kotha Prabhakar, ఈ సారి గులాబీ టికెట్ పైన దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీచేసి గెలవడంతో ఆ పార్టీ మరో కొత్త అభ్యర్థిని వెతుక్కోక తప్పని పరిస్థితి ఉంది.
ఓడిపోయిన మెదక్ సీటు కూడా కేవలం 10 వేల ఓట్ల తేడాతో మాత్రమే కోల్పోయింది. మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ చూసుకుంటే, బీఆర్ఎస్ పార్టీకి తమ ప్రత్యర్థి పార్టీల కంటే సుమారుగా 2 లక్షల ఓట్ల మెజారిటీ ఎక్కువ ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు మెదక్ లోక్ సభ స్థానం నుండి బలమైన అభ్యర్థులను బరిలోకి దించడానికి హోమ్ వర్క్ చేస్తున్నాయి.
కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నా జగ్గా రెడ్డి…
కాంగ్రెస్ పార్టీ నుండి, మాజీ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గా రెడ్డి, నీలం మధు టికెట్ ఆశిస్తుండగా, బీజేపీ పార్టీ నుండి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు, గురువా రెడ్డి, అంజి రెడ్డి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు.
కాషాయ పార్టీ అధిష్టానం ఇక్కడి నుండి ఎవరు ఊహించని విధంగా, కొత్త అభ్యర్థిని బరిలోకి దించిన ఆశ్చర్య పోవాలిసిన అవసరం లేదు. అయితే, ఈ మూడు ప్రధాన పార్టీలు మాత్రం, ఇక్కడి నుండి అభ్యర్థిగా ఎవరిని దించాలనే దాని పైన తీవ్రంగా హోమ్ వర్క్ చేస్తున్నాయని తెలుస్తుంది.
ఎప్పటికప్పుడు బలబలాలను బేరీజు వేసుకుంటూ, అవతలి పార్టీ ఎలాంటి నాయకున్ని బరిలోకి దించనున్నది అనేది కూడా గమనించుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే లోపు, ఈ మూడు ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థుల పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మూడు పార్టీలు కూడా ఇప్పటికే తమ తమ అభ్యర్థుల పై ఒక నిర్ణయానికి వచ్చాయని, అవతలి పార్టీ అభ్యర్థి ఎవరినీ దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోనున్నాయి.