BRS BSP Alliance : లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేస్తాయి- కేసీఆర్
BRS BSP Alliance : తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ప్రకటించాయి. ప్రజల జీవితాల బాగు కోసం పొత్తు పెట్టుకుంటున్నట్లు రెండు పార్టీలు ప్రకటించాయి.
BRS BSP Alliance : తెలంగాణలో మరో పొత్తు పొడిచింది. బీఆర్ఎస్, బీఎస్పీ(BRS BSP Alliance) కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని సంయుక్తంగా నిర్ణయించారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిద్ధాంత పరంగా కూడా మేము ఓకే రకంగా ఉన్నామన్నారు. దళిత బంధు సహా ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. బీఎస్పీ అధిష్టానం అనుమతితో పొత్తు ప్రస్తావన తెచ్చారన్నారు. సీట్లు, విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. మాయావతితో రేపు, ఎల్లుండి మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు.
ఈ స్నేహం ప్రజల బాగు కోసం
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మాట్లాడుతూ...కేసీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో ఉందని, బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లౌకికవాదాన్ని నిరంతరంగా కాపాడిన నేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, బీఎస్పీ(BRS BSP Alliance) కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు. సీట్ల సర్దుబాటు అంశాన్ని అధిష్టానానికి నివేదిస్తామన్నారు.తెలంగాణలో ఈ స్నేహం ప్రజల జీవితాలను బాగు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. కేసీఆర్, మాయావతితో కూడా మాట్లాడుతారన్నారు.అనంతరం సీట్లపై ఒక్క నిర్ణయం తీసుకుంటామన్నారు.
బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులు
బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులు తొలి జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ నుంచి బి. వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పోటీ చేయనున్నారు. గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం నలుగురు అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
సంబంధిత కథనం