Kotha Prabhakar Reddy : పార్లమెంటు నుంచి అసెంబ్లీకి-మూడు సార్లు భారీ మెజార్టీతో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Kotha Prabhakar Reddy : రెండు సార్లు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి... ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు.
Kotha Prabhakar Reddy : రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా.. ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ప్రయాణమయ్యారు కొత్త ప్రభాకర్‌రెడ్డి. దుబ్బాక మండలం పోతారానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెలుపొందారు. దీంతో ఎంపీకి రాజీనామా చేసి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మెదక్ నుంచి అవకాశం కల్పించారు. ఉప ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో సైతం రెండోసారి ఎంపీగా గెలుపొంది ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ నుంచే దుబ్బాక ఎమ్మెల్యేగా మొదటి సారి గెలిచి శాసనసభకు వెళ్తున్నారు.
రెండు పర్యాయాలు ఎంపీగా రికార్డు మెజార్టీలే..
దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నమ్మినబంటు. వ్యాపారవేత్తగా ఉన్నత స్థాయిలో ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లో మెదక్ పార్లమెంటు ఉపఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డికి అత్యధికంగా 3,61,277 ఓట్ల రికార్డు మెజార్టీతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిపై ఘన విజయం సాధించారు. అలాగే 2019 పార్లమెంటు ఎన్నికల్లో సైతం మెదక్ నుంచే మళ్లీ 3,16,427 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌పై గెలుపొందడం విశేషం. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఆదేశాల మేరకు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి 53,513 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే అక్టోబర్ 30న దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో కత్తి దాడిలో తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలోనే 20 రోజుల పాటు ఉన్నారు. నామినేషన్ చివరిరోజున మాత్రమే ప్రత్యేక అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్ వేశారు. పోలింగ్‌కు 2 రోజుల ముందు కోలుకోవడంతో సీఎం కేసీఆర్ సభలో పాల్గొని ప్రజలను తనను గెలిపించాలని అభ్యర్థించారు. దీంతో ఆయన ప్రచారం చేపట్టకున్నా ప్రజలు నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించడం విశేషం.
నెరవేరిన కల... ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రయాణం
ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ప్రభాకర్‌రెడ్డి ముందుకుసాగుతున్నారు. తనకు మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉండేది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కల నెరవేరినట్లయింది. రామలింగారెడ్డి మరణంతో 2020 ఉప ఎన్నికల్లో 1079 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు గెలుపొందారు. ఇప్పుడు ఆయనపై ప్రభాకర్‌రెడ్డిని పోటీకి దింపడంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెడతా
ప్రభాకర్ రెడ్డి ఫై హత్యాయత్నం జరుగడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలోనే చికిత్స పొందితూ, ప్రచారాన్ని రాలేకపోయినా, ప్రజలు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించడం సంతోషకరమని కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంపాలని చూస్తే దేవుడి కరుణ, ప్రజల ఆశీస్సులతోనే నేను పునర్జన్మ ఎత్తానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకపోవడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. కాకపోతే కాంగ్రెస్ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. నేను ఎంపీగా రెండు పర్యాయాలు ప్రతిపక్షంలోనే ఉన్నానని, అయినా అత్యధికంగా నిధులు తెచ్చి మెదక్ పార్లమెంటు పరధిలో చాలా అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. ఇప్పడు కూడా నియోజక వర్గం అభివృద్ధికి శక్తిమేరకు కృషి చేస్తానన్నారు. తనకు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.