Nalgonda Politics : నల్గొండ గులాబీ దళంలో గుబులు, బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్
04 May 2024, 22:13 IST
- Nalgonda Politics : లోక్ సభ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. బీఆర్ఎస్ ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నల్గొండ గులాబీ దళంలో గుబులు
Nalgonda Politics : పార్లమెంటు ఎన్నికలు(Lok sabha Elections) వేదికగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) పార్టీని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. తమ అభ్యర్థుల గెలుపునకు వారెంత ఉపయోగపడతారన్న అంశం కంటే.. విపక్ష పార్టీకి పనిచేసే వారు లేకుండా చేయడంపై శ్రద్ధ పెడుతున్నారు. దీనిలో భాగంగానే ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయిలో పార్టీ హోదాల్లో ఉన్నవారిని తమ పార్టీలోకి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు అప్పజెప్పారు.
ఖాళీ అవుతున్న గులాబీ శిబిరం
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, బీఆర్ఎస్ (BRS)ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఆ పార్టీ నుంచి పలువురు నాయకులు గోడ దూకడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ పదవులు, హోదాలు అనుభవించిన నాయకులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పొసగని పలువురు నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇలా మార్పులు జరిగిన ప్రతీ చోటా బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. సూర్యాపేట మినహా, మిగిలిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి లీడర్లు, కొంత కేడర్ కాంగ్రెస్ కు వెళ్లిపోయారు. దీని ప్రభావం శాసన సభ ఎన్నికలపై పడింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ చేరికలకు (Congress Joinings)ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ ను మొత్తానికి మొత్తంగా ఖాళీ చేసే పనిలో పడింది. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి ఈ చేరికల మీద వ్యతిరేకత వస్తున్నా.. ఎన్నికల్లో ప్రయోజనం కోసం బీఆర్ఎస్ నాయకులను తీసుకుంటున్నారు.
అన్ని నియోజకవర్గాల్లో జంపింగులు
ఉమ్మడి నల్గొండ(Nalgonda)జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ (BRS)నుంచి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ముందుగా మున్సిపాలిటీలపై కన్నేసిన కాంగ్రెస్ (congress)నాయకులు.. ఆయా మున్సిపాలిటీల ఛైర్మన్లు, మొత్తంగా పాలక వర్గం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చోట అవిశ్వాస తీర్మానాల జోలికి వెళ్లలేదు. కానీ, తమ పార్టీలోకి రావడానికి ఇష్టపడని చోట మున్సిపల్ పాలకవర్గాలు, ఎంపీపీలపై అవిశ్వాసాల ఆయుధం ఎక్కుపెట్టి తమ వశం చేసుకున్నారు. నల్గొండ, నందికొండ(నాగార్జున సాగర్), హాలియా, నేరెడుచర్ల, వంటి వి మచ్చుకు కొన్ని. సూర్యాపేట(Suryapet)లో సైతం కౌన్సిలర్లను లాగేసుకున్నా.. ఒక్క ఓటు తేడాతో మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. దేవరకొండ, నాగార్జున సాగర్, దాదాపుగా మిర్యాలగూడెం నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణులు గూడు విడిచి కాంగ్రెస్ గూటికి చేరాయి. మిర్యాలగూడెంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, మరో 12 మంది కౌన్సిలర్ల రాకను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) అడ్డుకున్నా.. ఈ ఎన్నికల్లో భార్గవ్ వర్గమంతా కాంగ్రెస్ అభ్యర్థి కోసం పనిచేస్తోంది.
బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)నియోజకవర్గంలో సైతం జడ్పీటీసీ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పంచన చేశారు. జడ్పీ వైస్ ఛైర్మన్ పెద్దులు కాంగ్రెస్ లో చేరారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, సుఖేందర్ సోదరుడు, మదర్ డెయిరీ మాజీ ఛైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి వర్గమంతా కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు తమ వర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్ లోకి తీసుకువెళ్లే పనిలో ఉన్నారు. భువనగిరిలో సైతం అక్కడి బీఆర్ఎస్ నాయకుల చేరికలను కాంగ్రెస్ స్థానిక నాయకులు అడ్డుకుంటున్నా.. ముఖ్య నాయకులు వారిని తీసుకునే పనిలో ఉన్నారు. మునుగోడు నియోజక వర్గంలో కూడా అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) బీఆర్ఎస్ ను ఖతం పట్టించే పనిలో ఉన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresam) సైతం బీఆర్ఎస్ శ్రేణులను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. మొత్తంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిమగ్నమై ఉన్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల సమయంలో పార్టీలో కొనసాగుతున్న నాయకుల పనితీరుపై ఆ ప్రభావం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చేరికల వల్ల కాంగ్రెస్ లాభపడినా.. లాభ పడకున్నా, బీఆర్ఎస్ కు మాత్రం నష్టం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )