Lok Sabha elections : ఎన్నికల ఫలితాలకు ముందే తొలి సీటు గెలిచేసిన బీజేపీ- ఎలా అంటే..
22 April 2024, 17:19 IST
- Lok Sabha elections 2024 BJP : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో తొలి గెలుపు! గుజరాత్ సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఫలితాలు వెలువడకముందే ఇదెలా సాధ్యమైంది? అని అనుకుంటున్నారా? అయితే.. ఇది మీకసమే..
గుజరాత్ సూరత్ నియోజకవర్గం విజేత ముకేశ్..
Mukesh Dalal BJP : 2024 లోక్‌సభ ఎన్నికలు ఇప్పుడే మొదలయ్యాయి. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న వెలువడతాయి. మొత్తం 7 దశల పోలింగ్ ప్రక్రియకు.. జూన్ 4న ఫలితాలతో ముగింపు పడుతుంది. అయితే.. ఫలితాలు బయటకు వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. బీజేపీ తన తొలి సీటును తన ఖాతాలో వేసుకుంది! గుజరాత్‌లోని సూరత్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవశం చేసుకుంది. ఇదెలా సాధ్యమైందంటే..
గుజరాత్ సూరత్‌లో బీజేపీ గెలుపు..
గుజరాత్ సూరత్ నియోజకవర్గానికి దాదాపు 10మంది వరకు నామినేషన్ వేశారు. వారిలో ఒకరు బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్. కాగా.. నామినేషన్ పేపర్లలో ఫోర్జరీ సంతకాలు పెట్టించారంటూ.. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని అఫిడవిట్ని రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. ఫలితంగా.. ముకేశ్ దలాల్‌తో పాటు 8మంది అభ్యర్థులు మిగిలారు. వీరిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులే.
కాగా.. సూరత్ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. బీజేపీ ముకేశ్ దలాల్ మినహా.. 8మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా.. ఎలాంటి పోటీ లేకుండానే.. గుజరాత్ సూరత్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్. ఈ విషయాన్ని.. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు.
Lok Sabha elections 2024 : "ప్రధానమంత్రికి.. గుజరాత్ తొలి కమలాన్ని అందించింది. ఏకగ్రీవంగా గెలుపొందిన సూరత్ లోక్‌సభ అభ్యర్థి ముకేశ్ దలాల్‌కు నా అభినందనలు," అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు పాటిల్.
నిలేశ్ స్థానంలో కాంగ్రెస్ దింపిన మరో అభ్యర్థి సురేశ్ పద్సాల నామినేషన్ కూడా ఇన్వాలిడ్ అని ధ్రువీకరించారు అధికారులు. అలా.. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
"కాంగ్రెస్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సహజంగా, జెన్యూన్‌గా లేవు. తాము సంతకాలు చేయలేదని.. అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించిన వారు చెప్పారు. ఫామ్‌లను తాము సంతకం చేయలేదని తేల్చిచెప్పారు," అని రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు.
Lok Sabha elections 2024 BJP : ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొంది. ఈ విషయంపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేసింది.
"మన ఎన్నికలు, మన ప్రజాస్వామ్యాం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యగం.. అన్ని ప్రమాదంలో పడ్డాయి. మన జీవితంలోనే అతి ముఖ్యమైన ఎన్నికలు ఇవి," అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు.
ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగుతుంటే.. సంబంధిత నియోకవర్గం నుంచి కనీసం ఒక్క ఓటరు సంతకమైనా ఉండాలి. స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ నుంచి బరిలో దిగితే.. సంబంధిత నియోజకవర్గం నుంచి కనీసం 10 మంది ఓటర్ల సంతకాలైనా ఉండాలి.