Nizamabad BJP MP Dharmapuri Arvind: కాంగ్రెస్ అంటేనే కరెప్షన్.. కమీషన్ పార్టీ అని ఎద్దేవా చేశారు నిజామాబాద్ ఎంపీ బిజేపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind). కాంగ్రెస్ ఖాళీ అవుతుందని..రేపో మాపో రేవంత్ రెడ్డి సైతం బిజేపి లోకి వస్తారని తెలిపారు. ఆగస్టు లో రాజకీయ సంక్షోభం వస్తుందట కదా అని నేతల వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ఆగస్టు దాకా ఎందుకు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు బిజేపి లో చేరుతున్నారని..త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడుతారని చెప్పారు. రేవంత్ రెడ్డి(CM Revanth reddy) బ్యాక్ గ్రౌండ్ ఏబీవీపీ, లోపల హిందుత్వం ఉందని.. అందుకే రేవంత్ ఏమి చేయలేక కాంగ్రెస్ లో గోస పడుతున్నాడని తెలిపారు. ఒక హిందూవుకు మేలు చేయలేని ముఖ్యమంత్రి మనకు ఉన్నారని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల కు వచ్చిన అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ… ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చిన్నాభిన్నం చేసిందని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ తోపాటు, త్రిపుల్ తలాక్ మళ్లీ తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారని మండిపడ్డారు. అసలు ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎజెండానేలేదని, గందరగోళంలో ఉన్న పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి బీజేపీపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ ఆశయం యూనిఫాం సివిల్ కోడ్ అని, 60 ఏళ్లుపాలించిన కాంగ్రెస్ ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పథకం ఏమైందని, మహిళలు, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు. యువత అంతా మోదీ వెంటే ఉన్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) డ్యామేజీకి బాధ్యులైన వారిని జైలుకు పంపాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే సిబిఐ ఎంట్రీకి ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణతో పాత్రధారులు, సూత్రధారులను గుర్తించి జైలుకు పంపుతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు దేశ దశదిశను మార్చే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీ వైపు నిలబడతారన్నారు.
రిపోర్టింగ్ - HT తెలుగు Correspondent K.V.REDDY, Karimnagar