Loksabha Elections 2024 : సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్..! ఈసారి సక్సెస్ కొడతారా..?-parliament elections have become the biggest challenge for cm revanth reddy in telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Loksabha Elections 2024 : సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్..! ఈసారి సక్సెస్ కొడతారా..?

Loksabha Elections 2024 : సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్..! ఈసారి సక్సెస్ కొడతారా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 21, 2024 03:03 PM IST

Loksabha Elections in Telangana 2024 : ఈ పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతిపెద్ద సవాల్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. తెలంగాణలో అధికారంలోకి రావటంతో మెజార్టీ సీట్లపై కన్నేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Loksabha Elections in Telangana 2024 : పార్లమెంట్ ఎన్నికల(Loksabha Elections i) వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా సాగుతున్నాయి. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీని అందుకుంది కాంగ్రెస్. దీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… బలమైన శక్తిగా తయారయ్యే పనిలో పడింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచి తిరుగులేని శక్తిగా నిలవాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే… ఈ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)…. కీలకంగా మారారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థాానాల్లో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ దాటి దగ్గరగా ఉండటంతో… రేవంత్ సర్కార్ కొనసాగింపుపై అనేక అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన కాంగ్రెస్…. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. గతంలో పార్టీని వీడిన కీలక నేతలను తిరిగి రప్పించటంలో సక్సెస్ కావటంతో పాటు…. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా గురి పెట్టింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కండువా కప్పేసింది. మరికొందరూ కూడా లైన్ లో ఉన్నారంటూ…. సీఎంతో సహా ముఖ్య నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ… ఇటీవలే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరింత అప్రమతమైంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం.

సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్..?

ప్రస్తుతం జరుగుతున్న  పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy)కి అతిపెద్ద సవాల్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన… అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఫలితంగా ఆయనకు సీఎం పీఠాన్ని ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఎంపీ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లలో గెలిచి… సత్తా చాటాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన కీలకంగా పని చేశారు. మెజార్టీ స్థానాల్లో ఆయన సూచించిన వారికే స్థానాలు దక్కాయి. దీంతో ఆయా అభ్యర్థుల గెలుపు బాధ్యతలు కూడా ఓ రకంగా రేవంత్ రెడ్డే తీసుకున్నట్లు అయింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పలువురు నేతలను తీసుకోవటమే కాకుండా… ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారు. దీంతో ఆయా స్థానాల్లో విజయం రేవంత్ రెడ్డికి అతిపెద్ద సవాల్ గా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా..ప్రస్తుతం అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికల్లో 12కిపైగా స్థానాలను ఆశిస్తోంది కాంగ్రెస్. అయితే చాలాచోట్ల త్రిముఖ పోరు కనిపిస్తోంది. విజయం అంతా సులభంగా వచ్చేలా కనిపించటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు బీజేపీ బలమైన పోటీదారుడిగా ఉండటంతో పాటు కేసీఆర్ కూడా జనాల్లోకి వెళ్తున్నారు. మోదీ మ్యానియాతో మెజార్టీ సీట్లను కొట్టాలని కమలదళం చూస్తుండగా…. మెరుగైన స్థానాలను గెలిచి ప్రధాన పార్టీలకు సవాల్ విసరాలని బీఆర్ఎస్ చూస్తోంది.

రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇందులో రెండు మూడు చోట్ల కాంగ్రెస్ కు వన్ సైడ్ గా ఉన్నప్పటికీ… మిగతా స్థానాల్లో విజయం కోసం గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ రకంగా రేవంత్ రెడ్డికి సవాల్ గా మారాయనే చెప్పొచ్చు. మెజార్టీ సీట్లలో పార్టీని గెలిచి… అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డి మరోసారి సక్సెస్ను కొడతారా లేదా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది…!