CM Revanth Reddy : కేసీఆర్... నేను హైటెన్షన్ వైర్ లాంటోన్ని, టచ్ చేసి చూడు - సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్-cm revanth reddy reacted to kcr comments on 20 mlas to join brs ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Revanth Reddy : కేసీఆర్... నేను హైటెన్షన్ వైర్ లాంటోన్ని, టచ్ చేసి చూడు - సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

CM Revanth Reddy : కేసీఆర్... నేను హైటెన్షన్ వైర్ లాంటోన్ని, టచ్ చేసి చూడు - సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 19, 2024 03:44 PM IST

CM Revanth Reddy On KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను హైటెన్షన్ వైర్ లాంటోనని… కాంగ్రెస్ పార్టీని టచ్ చేసి చూస్తే ఏమవుతుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్
కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Reddy On KCR : పార్లమెంట్ ఎన్నికల వేళ(Loksabha Elections 2024) అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సొంత పార్టీ నేతలతో చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. శుక్రవారం మహబూబ్ నగర్ లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీచందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

yearly horoscope entry point

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పాలమూరు ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. “గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కేటీఆర్ మాత్రం కేవలం కారు రిపేర్ అయిందని చెబుతున్నారు. కానీ ఇంజనే పూర్తిగా పాడైపోయింది. తూకం పెట్టి అమ్మేసే సమయం వచ్చింది. కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగాలేదు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లు ఉన్నారని కేసీఆర్ పిట్టలదొరలా మాట్లాడుతున్నాడు. ఆయన చిటికె కాదు... డప్పు కొట్టినా ఎవరు రారు. గతంలో మాదిరిగా ఎమ్మెల్యేలను కొనే పరిస్థితి ఉండదు. ఇక్కడ కాపలాగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాను. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)… హైటెన్షన్ వైర్ లాంటోడు. వచ్చి టచ్ చేసి చూస్తే తెలుస్తుంది ఏమవుతుందనేది” అంటూ కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

అసలు కేసీఆర్ ఏమన్నారంటే..?

గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న పార్లమెంట్ ఎన్నికల విస్తృతస్థాయి స‌మావేశం జరిగింది. పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేశారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తెలంగాణలోని కాంగ్రెస్(TS Congress Govt) ప్రభుత్వం మనుగడ సాధించటం కష్టమే అనిపిస్తోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారని తెలిసింది. “నాడు బీఆర్ఎస్ పార్టీకి వంద మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగానే… సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ యత్నించింది. అలాంటిది మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా..?” అని నేతలతో అన్నట్లు సమాచారం.

ఇక ఇదే సమావేశంలో పార్టీ మారుతున్న వారి విషయంలో కూడా సంచలన విషయాలను బయటపెట్టారు కేసీఆర్. కాంగ్రెస్ లోకి వెళ్లినవారు బాధపడుతున్నారని… అక్కడ పరిస్థితి ఏం బాగాలేదని చెప్పారని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నాయకుడు తనని సంప్రదించారని కేసీఆర్ చెప్పటం ఇప్పుడు అతిపెద్ద సంచలనంగా మారింది. బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని సదరు సీనియర్ నేత చెప్పినట్లు కేసీఆర్ నేతలతో అన్నారట..! “ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని నన్ను సంప్రదించాడు, కానీ ఇప్పుడే వద్దని చెప్పాను” అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ…. కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయలేరన్నారు.

Whats_app_banner