Lok Sabha Elections : ఎన్డీఏ వర్సెస్ ఇండియా.. తొలి దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్..
19 April 2024, 21:52 IST
- Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల సమరం మొదలైంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా.. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. మరి ఓటరు ఓటు ఎవరికి?
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమాప్తం
Lok Sabha Elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 102 లోక్ సభ స్థానాల్లో సుమారు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. తొలి దశ పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్, మణిపూర్ లలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్ లో ఘర్షణలు; రాళ్ల దాడికి పాల్పడిన ఇరు వర్గాలు
పశ్చిమ బెంగాల్ లో తొలి దశలో మూడు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో బీజేపీ, టీఎంసీ అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. శుక్రవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే కూచ్ బెహార్ స్థానంలోని పలు పోలింగ్ బూత్ ల వద్ద బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. ప్రత్యర్థుల నాటు బాంబు దాడిలో చందామరి గ్రామంలో టీఎంసీ నేత అనంత్ గాయపడ్డారు.
చత్తీస్ గఢ్ బస్తర్ లో కొనసాగుతున్న పోలింగ్; బీజాపూర్ లో గ్రెనేడ్ పేలుడు
ఇటీవల భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుని 29 మంది మావోలు మృతి చెందిన బస్తర్ ప్రాంతంలో శుక్రవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చెదురుముదురు ఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఇక్కడ 28.12 శాతం పోలింగ్ నమోదైంది. బీజాపూర్ లో గ్రెనేడ్ పేలుడులో ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు.
4 గంటల్లో 24శాతం ఓటింగ్..
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. కాగా.. 4 గంటల్లో 24శాతం పోలింగ్ నమోదైంది.
రామ్‌దేవ్ బాబా ఓటు..
యోగా గురువు రామ్‌దేవ్ బాబా.. ఉత్తరాఖండ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండియా కోసం ఓటు వేశానని, డ్రగ్-ఫ్రీ ఇండియా కోసం ఓటు వేశానని ఆయన అన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అమిత్ షా నామినేషన్..
కేంద్రమంత్రి అమిత్ షా.. గుజరాత్‌లోని గాంధీ నగర్లో తన నామినేషన్‌ని దాఖలు చేశారు.
బెంగాల్లో ఘర్షణలు..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో ఘర్షణలు వెలుగులోకి వచ్చాయి. అనేక పోలింగ్ స్టేషన్స్‌కు సమీపంలో.. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు గొడవపడినట్టు వార్తలు వస్తున్నాయి.
ఓటు వేసిన సీఎంలు..
ఎలక్షన్స్ జరుగుతున్న ప్రాంతాల్లో.. ఆయా రాష్ట్ర సీఎంలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు కూడా తరలివచ్చి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.
తరలివస్తున్న ఓటర్లు..
దేశ నలుమూలల ప్రజలు ఓటు వేసేందుకు తరలివెళుతున్నారు! వృద్ధులు, యువత, దివ్యాంగులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కమల్ హాసన్ ఓటు..
చెన్నై కోయంబెడులోని ఓ పోలింగ్ స్టేషన్లో.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్.
రాహుల్ గాంధీ పిలుపు..
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
పోరులో ప్రముఖులు..
2024 లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై, డీఎంకే కనిమొళి సహా ఇతర ప్రముఖ నేతలు బరిలో నిలిచారు.
7 దశల్లో పోలింగ్..
మొత్తం 543 సీట్లు లోక్‌సభకు 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మెజారిటీ మార్క్ 272గా ఉంది.
పుదుచ్చెరి సీఎం..
పుదుచ్చెరి సీఎం రంగస్వామి.. బైక్ నడుపుకుంటూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన తమిళనాడు సీఎం..
తమిళనాడు సీఎం స్టాలిన్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రాష్ట్రంలోని మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. తొలి దశలో పోలింగ్ జరగుతోంది.
ఓటేసిన రజినీ కాంత్..
సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఓటు వేశారు. చెన్నైలోని ఓ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మోదీ పిలుపు..
2024 లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా.. యువత, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు.. కచ్చితంగా ఓటు వేయాలని అన్నారు.
ఓటేసిన తమిళిసై..
తెలంగాణ మాజీ సీఎం తమిళిసై.. చెన్నై సాలిగ్రామ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసిన మోహన్ భగవంత్..
ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవంత్.. నాగ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్..
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది.7 దశల్లో ఇదే అత్యధికం!
పోలింగ్ టైమింగ్స్ ఇవే..
ఉదయం 7 గంటలకు మొదలయ్యే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది.
టార్గెట్ 400..
2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో గెలిచింది. ఈసారి 370 సీట్లు సంపాదించాలని చూస్తోంది. మొత్తం మీద.. 543 సీట్లల్లో 400 కన్నా ఎక్కువ స్థానాల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
ఈవీఎం మాక్ టెస్ట్..
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో భాగంగా.. ప్రస్తుతం వివిధ పోలింగ్ స్టేషన్స్‌లో ఈవీఎం మాక్ టెస్ట్‌లు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలువుతుంది.
1.87లక్షల పోలింగ్ కేంద్రాల్లో..
తొలి దశ పోలింగ్‌లో భాగంగా.. 1,87,000 పోలింగ్ కేంద్రాల్లో.. 166 మిలియన్ మంది ఓటర్లు.. నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నేడు పోలింగ్ జరగనున్న ప్రాంతాలు..
తొలి దశ పోలింగ్‌లో భాగంగా.. తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తర్‌ప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్‌ప్రదేశ్ (2), మేఘాలయ (2), అండమాన్ అండ్ నికోబార్ (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చెరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1), అసోం (5), మహారాష్ట్ర (5), బిహార్ (4), మణిపూర్ (2), పశ్చిమ్ బెంగాల్ (3), త్రిపుర- జమ్ముకశ్మీర్- ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో సీటుకు పోలింగ్ జరగనుంది.
ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా..
లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో.. నేడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ సీట్లున్నాయి.
లోక్‌సభ ఎన్నికలు 2024..
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమరానికి ఆసన్నమైంది. ఇంకొన్ని గంటల్లో.. 2024 లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభంకానుంది. హ్యాట్రిక్ విజయంతో తిరిగి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తీవ్రంగా కృషిచేస్తోంది. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. మొత్తం 7 దశల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ఆరంభమవుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.