Khammam : ఎన్నికల వేళ ఖమ్మంలో బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లో చేరిన నగర మేయర్
04 May 2024, 6:45 IST
- Khammam Mayor Joined Congress : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ కాంగ్రెస్ లో చేరారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం మేయర్
Khammam Municipal Corporation Mayor : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(Khammam Municipal Corporation) మేయర్ పునుకొల్లు నీరజ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
మేయర్ తో(Khammam Mayor) పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు సరిపూడి రమాదేవి, కొత్తపల్లి నీరజ కూడా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి అతి పెద్ద షాక్ తగిలింది.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన ఖమ్మం నియోజకవర్గంలో ఏకంగా కార్పొరేషన్ మేయర్ పార్టీని వీడటంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ లోనుంచి కాంగ్రెస్ లోకి మొదలైన కార్పొరేటర్ల జంపింగ్ లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా మేయర్ పార్టీని వీడటంతో పార్లమెంట్ ఎన్నికలోపు మరికొంత మంది కాంగ్రెస్ లోకి వరుస కట్టే అవకాశాలు ఉన్నట్లు బీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న తాజా పరిణామం జిల్లా కేంద్రంలో తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రచారం..
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఖమ్మం కార్పొరేషన్ మేయర్(Khammam Municipal Corporation Mayor) పునుకొల్లు నీరజ గులాబీ పార్టీని వీడతారని చర్చ జోరుగా జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. "మా అజయ్ అన్న మమ్మల్ని కష్టపడి గెలిపించారు.. మేము ఏ పార్టీలోకి వెళ్లం.. నీతి, నిజాయితీలతో మేం పని చేస్తున్నాం.. మాకు పార్టీ పట్ల నిబద్ధత ఉంది.. మమ్మల్ని ఆకర్షించాలని ఇంకోసారి ఎవరైనా ప్రయత్నం చేస్తే చెప్పుతో కొడతా.." అని ఆమె ఒక సమావేశంలో ఆవేశంగా వ్యాఖ్యానించారు.
తాజాగా ఆమె తాజా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం తీవ్ర చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి ఇప్పటికి 16 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ లో అవిశ్వాసం పెట్టి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేశారు. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లోలాగే అవిశ్వాస తీర్మానం పెట్టి గులాబీ మేయర్ ని దించేసి కొత్త మేయర్ ను ఎంపిక చేయాలని ఎత్తుగడలు వేశారు. ఇదే జరిగితే మేయర్ నీరజకు పదవీ గండం ఏర్పడేది. దీంతో ఆమె తెలివిగా గులాబీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ లో చేరడం ద్వారా పదవి కాపాడుకున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంమీద సమీప రోజుల్లోనే మరికొంత మంది కార్పొరేటర్లు గులాబీ గూడు వీడి మూడు రంగుల జెండా కప్పుకుంటారన్న చర్చ జోరందుకుంది.