CPM Telangana : అక్కడ కూటమి... ఇక్కడ ఒంటరిగానే..! భువనగిరి అభ్యర్థిని ప్రకటించిన సీపీయం
20 March 2024, 17:41 IST
- Loksabha Elections in Telangana 2024: సీపీయం పార్టీ తెలంగాణలో మరోసారి ఒంటరిగానే బరిలో దిగనుంది. ఇందులో భాగంగా…. భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసింది.
సీపీయం భువనగిరి అభ్యర్థి ఖరారు
Loksabha Elections in Telangana 2024: దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో యాక్టివ్ గా ఉంది సీపీయం పార్టీ. అయితే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ… లోక్ సభ ఎన్నికల్లో కూడా సింగిల్ గానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా… ఇవాళ భువనగిరి పార్లమెంట్ స్థానానికి(Loksabha Elections 2024) అభ్యర్థిని ఖరారు చేసింది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో పోటీపై కూడా త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇండియా కూటమిలో సీపీయం - ఇక్కడ ఒంటరిగానే…
దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఇండియా కూటమి ఏర్పాటైంది. ఇందులో సీపీయం(CPIM) పార్టీ కీలకంగా ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం… పరిస్థితి భిన్నంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవటంతో… సింగిల్ గానే బరిలోకి దిగింది సీపీయం. కానీ సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు… కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వచ్చాయి. కానీ ఆ దిశగా రాష్ట్రంలో అడుగులు పడటం లేదు. జాతీయస్థాయిలో నేతల మధ్య సఖ్యత, చర్చలు ఉండగా… రాష్ట్ర స్థాయిలో మాత్రం…. పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పలు స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. దీంతో కమ్యూనిస్టు పార్టీలు… డైలామాలో పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే…. సీపీయం ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక్కస్థానానికి అభ్యర్థిని ప్రకటించిన సీపీయం…. త్వరలోనే మిగిలిన స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది. ఇక సీపీఐ పార్టీ… కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా ఒక సీటును ఆశిస్తోంది. కానీ కాంగ్రెస్ ఒప్పుకుంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
భువనగిరి(Bhuvanagiri Congress MP Ticket) నుంచి ఇంతకూ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించాక.. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండుకు పదకొండు చోట్ల గెలిచాక లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగింది. కోమటిరెడ్డి కుటుంబం నుంచి నల్గొండ, భవనగిరి లోక్ సభా నియోజకవర్గాలకు టికెట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు(Munugodu) ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా.. నల్గొండ ఎంపీ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు, ఆయన మరో సోదరుడు మోహన్ రెడ్డి తనయుడు సూర్యపవన్ రెడ్డి టికెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, భువనగిరి ఎంపీ సీటు నుంచి తన భార్య లక్ష్మికి టికెట్ కావాలని రాజగోపాల్ రెడ్డి తొలుత ఆశించారు. అయితే, రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర్ర మంత్రివర్గం చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్న ఆయన తన భార్యకు ఎంపీ టికెట్ అడిగితే.. అది మంత్రి పదవికి అడ్డంకిగా మారుతుందేమోనని వెనక్కి తగ్గినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇపుడు కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ టికెట్ ఎవరిని వరిస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి(Bhuvanagiri MP Ticket 2024) టికెట్ ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహిత మిత్రునిగా ఉన్న చామలకు టికెట్ రావాలంటే కోమటిరెడ్డి సోదరుల ఆశీస్సులు తప్పని సరి. అయితే, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక పదవులను నిర్వహించిన అనుభవం కానీ, ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం కానీ, లేవు. ఈ సారి రాష్ట్రం నుంచి 17 ఎంపీ స్థానాలకు గాను, కనీసం 15 చోట్ల విజయం సాధించాలన్న పట్టుదలతో, ప్లాన్ తో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దీంతో ప్రతీ స్థానాన్ని ఆ పార్టీ కీలకంగా భావిస్తోంది. అంతేకాకుండా.. ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చైనా సరే టికెట్లు ఇవ్వాలన్న వ్యూహంతో ఉంది. ఈ ప్రణాళికల నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కుతుందా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇయనే కాకుండా… బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తరపున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు… గుత్తా అమిత్ కూడా ఈ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.