BRS to Congress : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ పసునూరి - బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించింది ఆ ఇద్దరే అంటూ కామెంట్స్
17 March 2024, 6:33 IST
- BRS Warangal MP Pasunoori Dayakar: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్… కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ లో చేరిన పసునూరి
Warangal MP Pasunoori Dayakar : వరంగల్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించారని ఎంపీ పసునూరి దయాకర్(MP Pasunoori Dayakar) అన్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించిన ఆయన, టికెట్ దక్కకపోవడంతో పార్టీ తీరుపై అసంతృప్తి చెందారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పసునూరి దయాకర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి దాదాపు 23 ఏళ్ల పాటు కార్యకర్తగా పని చేశానని, ఉద్యమంలో తన వంతుగా పాత్ర పోషించానన్నారు. కానీ రానురాను ఉద్యమంలో మార్పు జరిగిందని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు.
కావ్యకు ఉద్యమంతో సంబంధం ఉందా..?
బీఆర్ఎస్ లో ఎంతోకాలంగా పని చేసిన తనకు కాకుండా, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యకు కేసీఆర్ ఎంపీ టికెట్ కేటాయించారని పసునూరి దయాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఒక ఎంపీగా తనకు ఎప్పుడూ ప్రొటోకాల్ కూడా ఇవ్వలేదని, అందరు ఎంపీలకు ప్రొటోకాల్ ఇచ్చి తనను మాత్రం అవమానించారని దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఇబ్బందులు ఎదురయ్యేవని, వరంగల్ లో ఏ కార్యక్రమాలకు పోవాలన్నా అనుమతి తీసుకోవాలా అని ప్రవ్నించారు. తనకు సమాచారం లేకుండానే పార్టీ మీటింగులు నిర్వహించేవారని, తనకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా ఎంతో ప్రజల ఆదరణ ఉన్న తనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివక్ష చూపించారని దయాకర్ చెప్పుకొచ్చారు.
ప్రజలు కాంగ్రెస్ నే నమ్ముతున్నారు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితుడినయ్యానని, అందుకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth REddy) తనకు 30 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగిందని, హస్తం పార్టీలో స్వేచ్ఛ కలిగిన కార్యకర్తగా పని చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీని పసునూరి దయాకర్, ఆయన అనుచరులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. వారి వెంట ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఉన్నారు.