Ex MP Jithender Reddy : బీజేపీకి షాక్... కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి, కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తూ ఉత్తర్వులు-bjp leader former mp ap jithender reddy joined congress ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ex Mp Jithender Reddy : బీజేపీకి షాక్... కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి, కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తూ ఉత్తర్వులు

Ex MP Jithender Reddy : బీజేపీకి షాక్... కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి, కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తూ ఉత్తర్వులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 15, 2024 10:16 PM IST

Former MP AP Jithender Reddy: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన… కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి
కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి

AP Jithender Reddy joined Congress: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి(AP Jithender Reddy)… బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు జితేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే… గురువారం ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో… ఇవాళ పార్టీకి రాజీనామా చేసిన జితేందర్ రెడ్డి… హస్తం గూటికి చేరారు.

జితేందర్ రెడ్డికి పదవి…

కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డికి(AP Jithender Reddy) పదవిని కట్టబెట్టింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. కేబినెట్ ర్యాంక్ ను కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి ఆశించారు జితేందర్ రెడ్డి. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్‌ రెడ్డి ప్లాన్‌ చేసుకున్నారు. అయితే తాజాగా విడుదలైన జాబితాలో ఆయన పేరు లేదు. ఈ సీటుు మరో సీనియర్ మహిళా నాయకురాలు డీకే అరుణకు ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం. దీంతో షాక్ కు గురయ్యారు జితేందర్ రెడ్డి. ఇదే సమయంలో… స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు సీఎం రేంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన కాంగ్రెస్ కండువా కప్పున్నారు. రేపు ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో…. నామినేటెడ్ పదవికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఇవాళే జారీ చేసింది ప్రభుత్వం.

13వ లోక్‌సభకు భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికయ్యారు జితేందర్ రెడ్డి. 2010లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో మహబూబ్ నగర్ నుంచి ఎంపిగా గెలిచారు. బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేతగా కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టని వీడి బీజేపీలో చేరారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ. మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన మిథున్ రెడ్డి ఓటమిపాలయ్యారు.

కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎంపీ దయాకర్...

మరోవైపు ఉద్యమాల జిల్లాగా పేరున్న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా.. తాజాగా మరో నేత కూడా ‘కారు’ దిగేందుకు రెడీ అయ్యారు. వరంగల్ సిట్టింగ్​ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్​ బీఆర్​ఎస్​ కు రాజీనామా చేసి కాంగ్రెస్​ లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్​ సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎంపీ పసునూరి దయాకర్​ సీఎం ను కలిసిన ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఒకట్రెండు రోజుల్లోనే దయాకర్​ కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జోరందుకుంది.

Whats_app_banner