కాంగ్రెస్​‌లోకి బీఆర్​ఎస్​ ఎంపీ! సీఎంను కలిసిన పసునూరి దయాకర్​-warangal mp pasunuri dayakar meets cm revanth reddy ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Warangal Mp Pasunuri Dayakar Meets Cm Revanth Reddy

కాంగ్రెస్​‌లోకి బీఆర్​ఎస్​ ఎంపీ! సీఎంను కలిసిన పసునూరి దయాకర్​

HT Telugu Desk HT Telugu
Mar 15, 2024 06:05 PM IST

వరంగల్లు ఎంపీ పసునూరి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.

ముఖ్యమంత్రిని కలిసిన పసునూరి దయాకర్
ముఖ్యమంత్రిని కలిసిన పసునూరి దయాకర్

ఉద్యమాల జిల్లాగా పేరున్న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా.. తాజాగా మరో నేత కూడా ‘కారు’ దిగేందుకు రెడీ అయ్యారు. వరంగల్ సిట్టింగ్​ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్​ బీఆర్​ఎస్​ కు రాజీనామా చేసి కాంగ్రెస్​ లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ట్రెండింగ్ వార్తలు

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్​ సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎంపీ పసునూరి దయాకర్​ సీఎం ను కలిసిన ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఒకట్రెండు రోజుల్లోనే దయాకర్​ కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జోరందుకుంది.

రెండు సార్లు ఎంపీగా..

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ గెలిచారు. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టి కర్తగా, ఉద్యమకారుడిగా ఆయనకు పేరుంది.

కాగా పార్టీ ఏర్పాటు నుంచి బీఆర్ఎస్‌లో ఉన్న ఆయన 2001 నుంచి 2009 వరకు పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009 నుంచి 2011 వరకు అప్పటి టీఆర్ఎస్ వీ జిల్లా అధ్యక్షుడిగా, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొనసాగారు.

ఆ తరువాత అరూరి రమేశ్ బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. పసునూరి దయాకర్ కు ఆ నియోజకవర్గ బాధ్యతలు కట్ చేశారు. ఇదిలాఉంటే తెలంగాణ ఏర్పడిన తరువాత 2015లో తొలిసారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన 6,15,403 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,315 ఓట్లకే పరిమితం అయ్యారు.

ఇక రెండోసారి 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో దయాకర్ 6,12,498 ఓట్లు సాధించగా.. సమీప ప్రత్యర్థి దొమ్మాటి సాంబయ్యకు 2,62,200 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మరోసారి టికెట్ ఆశించిన పసునూరి

రెండు సార్లు భారీ మెజారిటీ అందుకున్న దయాకర్ మరోసారి బీఆర్​ఎస్​ నుంచి మళ్లీ టికెట్ ఆశించారు. ఈ మేరకు హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాతో అధిష్ఠానం వద్ద తన ప్రతిపాదన పెట్టారు. కానీ నిన్న మొన్నటి వరకు వరంగల్ బీఆర్​ఎస్​ ఎంపీ టికెట్​ ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ కు కేటాయిస్తారని ప్రచారం జరిగినా, రెండు రోజుల కిందటే ఆ టికెట్​ ను స్టేషన్​ ఘన్ పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్​ కడియం కావ్యకు కేటాయించారు. దీంతో పసునూరి దయాకర్​ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

కాంగ్రెస్​ నుంచి బరిలో దిగేందుకేనా..?

వరంగల్ పార్లమెంట్​ నియోజకవర్గంలో సరైన పేరు లేకున్నా.. రెండు సార్లు బీఆర్​ఎస్​ టికెట్​ కేటాయించి కేసీఆర్​ దయాకర్​‌ను ఎంపీగా గెలిపించారు. కానీ ప్రస్తుత ఎంపీ టికెట్​ ను కడియం కావ్యకు కేటాయించడంతో ఇంతలోనే దయాకర్​ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

వరంగల్ ఎంపీ టికెట్​ ను కాంగ్రెస్​ పార్టీ ఇంకా ఎవరికీ ఫైనల్​ చేయకపోవడంతో అదే స్థానం నుంచి హస్తం పార్టీ తరఫున బరిలో దిగేందుకే దయాకర్​ పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జిల్లా ఇన్​ఛార్జ్​ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ, తదితరుల సమక్షంలో పసునూరి దయాకర్​ సీఎం రేవంత్​ రెడ్డిని కలవగా.. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్​ అయ్యాయి.

ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా పసునూరి దయాకర్​ కాంగ్రెస్​ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. మరి కాంగ్రెస్​ ఎంపీ టికెట్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలనిస్తాయో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel