తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bapatla Mp Suresh: పార్లమెంటుకు హాజరు అంతంతే... ప్రజా సమస్యలపై గళం విప్పింది నామమాత్రమే.. చివరి స్థానంలో ఎంపీ నందిగం

Bapatla MP Suresh: పార్లమెంటుకు హాజరు అంతంతే... ప్రజా సమస్యలపై గళం విప్పింది నామమాత్రమే.. చివరి స్థానంలో ఎంపీ నందిగం

Sarath chandra.B HT Telugu

08 April 2024, 10:06 IST

google News
    • Bapatla MP Suresh: 17వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 22మంది ఎంపీలు వైఎస్సార్సీపీ తరపున గెలుపొందార. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 25మంది ఎంపీల్లో చివరి స్థానంలో నిలిచి బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ రికార్డు సృష్టించారు.
అతి తక్కువ హాజరుతో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ రికార్డు
అతి తక్కువ హాజరుతో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ రికార్డు

అతి తక్కువ హాజరుతో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ రికార్డు

Bapatla MP Suresh: 17వ లోక్‌సభ 17th Loksabha గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. పార్లమెంటు చివరి సమావేశాలు Last Session కూడా ముగిసిపోయాయి. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుల పనితీరును పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.

రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల్లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చిట్ట చివరి స్థానంలో ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన బాపట్ల నుంచి ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే ఐదేళ్లలో సభకు హాజరు Attendance 35శాతం మాత్రమే ఉంది.

వైఎస్సార్సీపీ Ysrcp అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితుడిగా ఎదిగిన నందిగం సురేష్‌ పూర్వాశ్రంలో సాధారణ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసేవారు. అమరావతి ప్రాంతంలో రాజధాని భూముల సేకరణ సమయంలో పోలీసుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నారని, వైసీపీ తరపున పని చేస్తున్నందుకు తీవ్రమైన నిర్బంధానికి గురైనట్టు ఆ పార్టీ విస్తృత ప్రచారం చేసింది.

రాజధాని ప్రాంతంలో పంట పొలాలు తగులబెడిన సమయంలో రైతుల్ని పరామర్శించడానికి వచ్చిన సిఎం జగన్‌ దృష్టిలో పడటంతో నందిగం సురేష్ పొలిటికల్ లైఫ్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పార్లమెంటులో అడుగుపెట్టారు.

పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత 2019 జూన్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 10వరకు జరిగిన సమావేశాల్లో నందిగం సురేష్ కేవలం 35శాతం మాత్రమే హాజరు ఉంది. 2019 బడ్జెట్‌ సమావేశాల్లో 49శాతం, శీతాకాల సమావేశాల్లో 75శాతం హాజరయ్యారు. 2020 బడ్జెట్ సమావేశాల్లో 22శాతం, శీతకాల సమావేశాల్లో 60శాతం హాజరయ్యారు.

2021 బడ్జెట్ సమావేశాల్లో 29శాతం, శీతాకాల సమావేశాల్లో 71శాతం హాజరు నమోదైంది. 2022 బడ్జెట్ సమావేశాల్లో అత్యల్పంగా 11శాతం మాత్రమే హాజరయ్యారు. 2022 వర్షాకాల సమావేశాల్లో 50 శాతం హాజరైతే, శీతాకాల సమావేశాలను పూర్తిగా గైర్హాజరయ్యారు.

2023 బడ్జెట్ సమావేశాలకు 12శాతం మాత్రమే హాజరయ్యారు. 2023 వర్షాకాల సమావేశాలకు 47శాతం, 2023 ప్రత్యేక సెషన్‌కు 75శాతం వెళ్లారు. 2023 శీతాకాల సమావేశాలకు పూర్తిగా డుమ్మా కొట్టారు. 2024 బడ్జెట్ సమావేశాల్లో 22శాతం హాజరు నమోదైంది. లోక్‌సభ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో చేసిన సంతకాల ఆధారంగా నందిగం సురేష్‌ మొత్తం ఐదేళ్లలో కేవలం 35శాతం రోజులకు మాత్రమే హాజరయ్యారు. రెండు సెషన్లకు నందిగం సురేష్ పూర్తిగా గైర్హాజరయ్యారు.

రెండే రెండు చర్చల్లో ....

ప్రజలు ఓట్లు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపితే బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ఐదేళ్లలో రెండే రెండు డిబేట్‌లలో పాల్గొన్నారు. 2021 డిసెంబర్ 7న రాయలసీమ ప్రాంతంలో వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంపై జరిగిన చర్చలో నందిగం సురేష్ పాల్గొన్నారు.

అంతకు ముందు 2019 నవంబర్ 28న ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని జరిగిన చర్చలో పాల్గొన్నారు. 2020, 2022, 2023, 2024లో ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. ఐదేళ్లలో ఎంపీగా నందిగం సురేష్ పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నలు 8మాత్రమే...అవి కూడా 2022 బడ్జెట్‌ సమావేశాల్లో మాత్రమే ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మిగిలిన ఏ సెషన్‌లో ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తలేదు.

ఆయన లేవనెత్తిన 8ప్రశ్నల్లో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ కాలేజీల గురించి ఓ ప్రశ్న ఉంది. మిగిలిన ప్రశ్నలన్నీ వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఫిషరీస్, రూరల్ డెవలప్‌మెంట్‌, స్టాండప్ ఇండియా స్కీమ్‌పై ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆశా వర్కర్లకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తారు. ఇవన్నీ అన్‌ స్టార్డ్ ప్రశ్నలుగానే ఉన్నాయి.

బాపట్ల నుంచి తొలిసారి ఎన్నికైన ఐదేళ్లలో ఏమాత్రం పనితీరును ప్రదర్శించ లేకపోయినా.. నందిగం సురేష్‌ రెండోసారి వైఎస్సార్సీపీ తరపున పోటీచేస్తున్నారు. ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కంటే ఇతరత్రా వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక, మట్టి తవ్వకాల ఆరోపణలు, విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌పై దాడి వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. తాజా ఎన్నికల్లో బాపట్లలో వైసీపీ తరపున సురేష్, టీడీపీ తరపున మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ తలపడుతున్నారు.

తదుపరి వ్యాసం