AP Loksabha Members: పదేళ్లలో 50మంది ఎంపీలు లోక్‌సభకు ఎన్నిక.. అయినా ఏపీకి దక్కింది ఎంత?
AP Loksabha MPs: ఆంధ‌్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. పదేళ్లలో ఏపీ నుంచి 45మంది ఎంపీలుగా పార్లమెంటులో అడుగుపెట్టారు. మరో ఐదుగురు రెండు సార్లు ఎన్నికయ్యారు. పదేళ్లలో వీరంతా కలిసి ఏపీకి సాధించింది ఏమిటి?
AP Loksabha MPs: లోక్‌సభ Loksabhaఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు 45మంది ఏపీ నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు.ఐదుగురు సభ్యులు వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 16,17 లోక్‌సభల్లో రాష్ట్రం నుంచి ఎన్నికైన యాభై మందిలో ఐదుగురు రెండోసారి ఎన్నికైన వారు ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఏపీలో అసలు పార్లమెంటు సభ్యులు ఎవరు, పదేళ్లలో వారి ద్వారా రాష్ట్రానికి దక్కిన ప్రయోజనం ఎంత అనే చర్చ జరుగుతోంది. గతంలో పార్లమెంటు సభ్యులు ఢిల్లీతో పాటు సొంత నియోజక వర్గంలో కూడా క్రియాశీలకంగా ఉండేవారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటు Parliament సభ్యులుగా ఎవరు ఎన్నికయ్యారో, ఎవరు కనుమరుగయ్యారో కూడా తెలియని పరిస్థితి ఉంది.
17వ లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుల్లో చాలామంది తమ నియోజక వర్గాలకు తప్ప మిగిలిన రాష్ట్రంలో ఎవరికి పెద్దగా తెలియదు.16వ లోక్‌సభలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. 2019 ఎన్నికల్లో ఏపీలో 22మంది వైసీపీ ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారెవ్వరు తమను గెలిపించిన నియోజక వర్గ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గొంతు విప్పిన దాఖలాలు లేవు.
2014-19 మధ్య 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన కొత్తపల్లి గీత,పందుల రవీంద్రబాబు, మాల్యాద్రి శ్రీరామ్ వంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు.2014లో వైసీపీ తరపున గెలిచిన కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, బుట్టారేణుక వంటి వారు టీడీపీ గూటికి వెళ్లిపోయారు.
వైసీపీలో ఆ ఇద్దరే…..
17వ లోక్‌సభలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. వైసీపీ YCP తరపున 22మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నికైనా అధికారికంగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మినహా మిగిలిన ఎంపీలు ఎవరికి గొంతు విప్పే అవకాశం లేకపోవడంతో వాళ్ల పేర్లు కూడా జనానికి తెలియకుండా పోయాయి. ఇటీవల టిక్కెట్ దక్కక పార్టీని వీడిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పేరు కూడా జనానికి తెలిసే అవకాశం కూడా లేకపోయింది. పార్టీని వీడిన సమయంలోనే ఆయన పేరు పాపులర్ అయ్యింది.
2014కు ముందు ఏపీ నుంచి ఎన్నికైన ప్రతి ఎంపీ ఏదొక సందర్భంగా ప్రజల ముందుకు వచ్చేవారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఎంపీలు పార్టీలకతీతంగా పోరాటాలు చేసేవారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో లోపల, బయట పోరాడేవారు. విభజన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండు పార్టీల ఎంపీలు ఏమి చేస్తున్నారో ఎవరికి తెలియకుండా పోయింది.
2014లో ఏపీ నుంచి ఎంపీలుగా గెలిచిన వారిలో కొత్తపల్లి గీత(అరకు), రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), అశోక్ గజపతి రాజు (విజయనగరం), కంభంపాటి హరిబాబు(విశాఖపట్నం), ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అనకాపల్లి), తోట నరసింహం(కాకినాడ),రవీంద్రబాబు(అమలాపురం), మురళీమోహన్(రాజమండ్రి), గోకరాజు గంగరాజు(నరసాపురం), మాగంటి బాబు(ఏలూరు), కొనకళ్ల నారాయణ(మచిలీపట్నం), కేశినేని నాని(విజయవాడ), గల్లా జయదేవ్(గుంటూరు), రాయపాటి సాంబశివరావు(నరసరావుపేట), వైవీ సుబ్బారెడ్డి(ఒంగోలు), ఎస్పీవై రెడ్డి(ఒంగోలు), మాల్యాద్రి శ్రీరామ్ (బాపట్ల), బుట్టారేణుక(కర్నూలు), జేసీ దివాకర్ రెడ్డి( అనంతపురం), నిమ్మల కిష్టప్ప(హిందూపురం), వైఎస్ అవినాష్ రెడ్డి(కడప), మేకపాటి(నెల్లూరు), వి.దుర్గాప్రసాద్( తిరుపతి), పివి.మిథున్ రెడ్డి(రాజంపేట), శివప్రసాద్(తిరుపతి) నుంచి గెలిచారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మేకపాటి, మిథున్ రెడ్డి మాత్రమే చివరి వరకు వైసీపీలో కొనసాగారు.
2019లో ముగ్గురు మాత్రమే టీడీపీ TD తరపున గెలిచారు. అరకు గొడ్డేటి మాధవి, విజయనగరంలో బెల్లాన చంద్రశేఖర్, విశాఖలో ఎంవివి.సత్యనారాయణ, అనకాపల్లిలో భీశెట్టి సత్యవతి, కాకినాడలో వంగాగీత, అమలాపురంలో చింతా అనురాధ, రాజమండ్రిలో మార్గాని భరత్, నరసాపురంలో రఘురామ, ఏలూరులో కోటగిరి శ్రీధర్, మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలులో మాగుంట, నంద్యాల పోచ బ్రహ్మానందరెడ్డి బాపట్లలో నందిగం సురేష్, కర్నూలులో సంజీవ్ కుమార్, అనంతపురంలో తలారి రంగయ్య, హిందూపురంలో గోరంట్ల మాధవ్, కడపలో అవినాష్, నెల్లూరులో ఆదాల ప్రభాకర్, తిరుపతిలో గురుమూర్తి, రాజంపేటలో మిథున్ రెడ్డి, చిత్తూరులో రెడ్డప్ప గెలిచారు.
టీడీపీ తరపున 2019లో ముగ్గురు సభ్యులు మాత్రమే రెండోసారి గెలిచారు.వైసీపీ నుంచి మరో ఇద్దరు గెలిచారు. వీరిలో గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ గూటికి చేరారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రమే టీడీపీలో మిగిలారు. వైసీపీలో వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే 2014,2019లో రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
జనాలకు తెలియకుండానే నిష్క్రమణ…
ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల పేర్లను టక్కున చెప్పమంటే ఎవరైనా కాస్త ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి ఐదేళ్లలో ఏర్పడింది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. వైసీసీ రెబల్‌గా నాలుగేళ్లుగా హడావుడి చేసిన రఘురామ కృష్ణం రాజు ఒక్కడికే ప్రత్యేక గుర్తింపు లభించింది.
2019లో వైసీపీ తరపున గెలిచిన వారిలో బెల్లాన చంద్రశేఖర్,చింతా అనురాధ కోటగిరి శ్రీధర్,పోచా బ్రహ్మనందరెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్, తలారి రంగయ్య, ఎన్ రెడ్డప్ప వంటి వారికి ఐదేళ్లలో ఎప్పుడు ముందుండి పోరాడే అవకాశం దక్కలేదు. నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్ వంటి వారు సోషల్ మీడియా ట్రోల్స్‌తో పాపులర్ అయ్యారు.
ఎవరు అడ్డుకున్నారు…
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు ఎదురు చూస్తుంటే ఎంపీలు మాత్రం పదవీ కాలాన్ని కాలక్షేపానికి వినియోగిస్తున్నారనే విమర్శ ఉంది. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా ఒక్కరు కూడా దానిని సద్వినియోగం చేసుకున్న సందర్భాలు లేవు.
ఏదో అదృష్టం కొద్దీ ఎన్నికయ్యాం, పదవీ కాలాన్ని ఎంజాయ్ చేద్దామనే ధోరణే మెజార్టీ సభ్యుల్లో కనిపిస్తోంది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించకూడదనే ఆంక్షలు కూడా మరో కారణంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏమి మాట్లాడాలన్నా ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారికి పెద్దగా స్వేచ్ఛ లేదనే అభిప్రాయం ఉంది. పార్లమెంటులో ప్రశ్నల రూపంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నా దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వారు తక్కువే.
మరికొద్ది రోజుల్లో 17వ లోక్‌సభ సభ్యుల పదవీ కాలం కూడా పూర్తి కానుంది. మరోసారి పార్లమెంటులో అడుగుపెడతారో లేదో చాలామందికి గ్యారంటీ లేదు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లలో టీడీపీ, వైసీపీలకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే విషయంలో మాత్రం తగిన పనితీరును ప్రదర్శించ లేకపోయారనే విమర్శలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి పర్యటనల్లో సైతం నలుగురైదుగురు ఎంపీలు మినహా మిగిలిన వారికి ఆయన వెంట ఉండే అవకాశం కూడా లేదనే విమర్శ కూడా అధికార పార్టీపై ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన వైఖరితో ఉండేవారు. అధికార పార్టీల తరపున ఢిల్లీలో చక్రం తిప్పే కొద్ది మందికి తప్ప మిగిలిన ఎంపీల పాత్ర నామమాత్రం అయిపోవడంతో గెలిచిన ఎంపీలు కూడా ఎలాంటి గుర్తింపు లేకుండానే నిష్క్రమిస్తున్నారు.