తీరు మార్చుకోని ఎంపీ నందిగం
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మరోసారి పోలీసులతో పేచీకి దిగారు. మంగళవారం రాత్రి ఎంపీ పోలీసులపై చిందులు తొక్కిన వ్యవహారం వెలుగు చూసింది.
మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయ పరిసరాల్లోని రాయపూడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వాహన చోదకుడు తాను ఎంపీ నందిగం సురేష్ మనిషినని పోలీసులకు చెప్పాడు. వాహనానికి సంబంధించిన పత్రాలు చూపాల్సిందేనని పోలీసులు స్పష్టం చేయడంతో తాను ఎంపీ సోదరుడినని సదరు వ్యక్తి పోలీసుల్ని దబాయించాడు. పోలీసులు వాహన పత్రాల కోసం పట్టుబట్టడంతో అతను ఎంపీ నందిగం సురేష్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. కానిస్టేబుల్‌కు ఫోన్ ఇవ్వమని సూచించిన నందిగం సురేష్, తాను ఎంపీనని ఫోన్‌లో చెప్పారు. అందుకు ప్రతిగా కానిస్టేబుల్ సరేనని బదలిచ్చారు.
కానిస్టేబుల్ తనతో సరిగా మాట్లాడలేదని భావించిన ఎంపీ వెంటనే ఇంటికి రావాలని ఆదేశించారు. ఫోన్‌లో తాను ఎంపీనని చెబుతున్నా కానిస్టేబుల్ మర్యాద ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సిఐకు విషయం చెప్పడంతో ఆయన ఎస్సైతో కలిసి ఎంపీని కలిసి రావాలని సూచించారు. ఎంపీ ఇంటికి పోలీసులు వెళుతున్న క్రమంలో విషయం డిఎస్పీ దృష్టికి వెళ్లడంతో వారిని వెనక్కి పిలిపించారు. ఆ తర్వాత డిఎస్పీ ఫోన్‌లో డిఎస్పీతో మాట్లాడి సర్ది చెప్పారు.
పోలీసుల్ని ఇంటికి పిలిపిస్తే రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీని బుజ్జగించడంతో ఆయన చల్లబడ్డారు. అప్పటికే విషయం బయటకు పొక్కింది. ఎంపీ నందిగం సురేష్ మాత్రం బండికి హెల్మెట్ ఉన్నా తలకు పెట్టుకోకపోవడం వల్ల వాహనాన్ని పోలీసులు ఆపారని, తాను ఎవరిని బెదిరించలేదని చెప్పుకొచ్చారు.
గత నెలలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకుల్ని పోలీసులు ఆపడంతో ఎంపీ నేరుగా స్టేషన్‌కు వచ్చి రచ్చ చేశారు. ఎంపీ తన బంధువుల్నివిడిపించుకు పోయే క్రమంలో మొబైల్‌లో రికార్డు చేస్తున్న కానిస్టేబుల్‌పై అనుచరులు పిడిగుద్దులు కురిపించి ఫోన్ లాక్కుపోయారు. ముఖ్యమంత్రితో ఉన్న చనువును అడ్డం పెట్టుకుని నందిగం సురేష్ అరాచకం చేస్తున్నారని వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు.
టాపిక్