Amethi: అమేథీలో 1998 తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని కాంగ్రెస్ అభ్యర్థి
03 May 2024, 14:34 IST
ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం దేశ ప్రజలందరికీ సుపరిచితం. ఆ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోట వంటిది. 1980 ల నుంచి ఆ సీట్ నుంచి కాంగ్రెస్ తరఫున గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. కానీ, 1998 తరువాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ తరఫున అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
Lok sabha elections 2024: చాలా రోజుల ఉత్కంఠ తరువాత అమేథీ నియోజకవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కానీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, ఈ సారి ఎన్నికల్లో అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరి లాల్ శర్మను ప్రకటించారు. 1998 తర్వాత అమేథీ నుంచి గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తొలి అభ్యర్థి శర్మ కావడం విశేషం.
2019 లో రాహుల్ గాంధీ ఓటమి..
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ (Smriti Irani) చేతిలో ఓడిపోయారు. రాహుల్ గాంధీ తొలిసారి 2004లో అమేథీ నుంచి 3 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీని లక్ష ఓట్ల తేడాతో ఓడించారు. రాహుల్ గాంధీ 2019లో స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. 1999 తర్వాత అమేథీలో గాంధీ కుటుంబ నాయకుడిని ఓడించిన తొలి బీజేపీ నేతగా స్మృతి ఇరానీ రికార్డు సృష్టించారు. రాహుల్ గాంధీ మేనమామ సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీతో సహా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు 1980 నుండి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
1998 లో కూడా కాంగ్రెస్ ఓటమి
1998 లో కూడా అమేథీలో కాంగ్రెస్ తరఫున గాంధీ కుటుంబానికి చెందని సతీశ్ శర్మ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ సతీశ్ శర్మను ఓడించారు. ఏడాది తర్వాత సోనియా గాంధీ (Sonia Gandhi) సంజయ్ సింగ్ ను ఓడించి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి మళ్లీ పోటీ చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు, శ్రేణులు బలంగా కోరుకున్నారు. కానీ, ఈ సారి కేరళలోని వాయనాడ్ తో పాటు యూపీలోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్ణయించుకున్నారు. అమేథీ నియోజకవర్గ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ రాయ్ అభిప్రాయపడ్డారు. అక్కడ ఏ అభివృద్ధి జరిగినా దానికి కారణం ఆ కుటుంబం అని ఆయన అన్నారు.
మే 20 న పోలింగ్..
యూపీలోని అమేథీలో లోక్ సభ ఐదో విడత ఎన్నికల్లో (Lok sabha elections 2024) భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అమేథీ (Amethi), రాయ్ బరేలీ (Rae Bareli) స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడానికి మే 3వ తేదీ చివరి రోజు. ఈ ఏడాది రాజ్యసభకు వెళ్లే వరకు కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ రాయ్ బరేలీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాయ్ బరేలీ నుంచి సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రాయ్ బరేలీ, అమేథీ లోక్ సభ స్థానాల నుంచి గాంధీ కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ మార్చిలో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ రెండు స్థానాలకు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను సిఫారసు చేసింది.