AIMIM: మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల బరిలోకి ఎంఐఎం; ఏడు స్థానాల్లో పోటీకి సిద్ధం
03 April 2024, 20:29 IST
AIMIM: అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ మహారాష్ట్ర లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మహారాష్ట్రలో కనీసం ఏడు స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ ఇంతియాజ్ జలీల్ వెల్లడించారు.
ఏఐఎంఐఎం మహారాష్ట్ర చీఫ్ ఇంతియాజ్ జలీల్
AIMIM: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ (VBA) కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో విపక్షాల మధ్య ఓట్లు చీలి బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే) వర్గాల అభ్యర్థులకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఏడు సీట్లలో ఎంఐఎం
మహారాష్ట్రంలో ఔరంగాబాద్ సహా దాదాపు ఏడు స్థానాల్లో ఎంఐఎం (MIM) పోటీ చేయనుంది. మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఇంతియాజ్ జలీల్ ఔరంగాబాద్ లోక్ సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేయనున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇంతియాజ్ జలీల్ ఔరంగాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జలీల్ కు 4,492 ఓట్ల స్వల్ప మెజారిటీ లభించింది. ఆ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎంఎన్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ కూడా ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఔరంగాబాద్ తో పాటు పుణె, బీడ్, నాందేడ్, బుల్ధానా, ముంబై చుట్టుపక్కల రెండు లేదా మూడు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసే అవకాశం ఉంది.
విపక్ష కూటమికి చిక్కులు
ఎంఐఎం ఎంట్రీ విపక్ష కూటమి మహారాష్ట్ర వికాస్ అఘాడీ (MVA)కి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం, వీబీఏలు కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎంఐఎం- వీబీఏ కూటమి దాదాపు 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది. ఆ ఎన్నికల్లో ఎంఐఎం- వీబీఏ కూటమికి 7.63% ఓట్లు రావడం విశేషం. ఆ కూటమి వల్ల 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే ఓటమి పాలయ్యారు.
ఈ సారి ఎంఐఎం, వీబీఏ వేరు వేరుగా పోటీ
ఈసారి ఎంఐఎం, వీబీఏ పార్టీలు సొంతంగా పోటీ చేస్తున్నాయి. వీబీఏ ఇప్పటికే 20 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఎంఐఎం ఔరంగాబాద్ సహా ఏడు స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ముంబైలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం మహారాష్ట్ర చీఫ్ జలీల్ తెలిపారు. థానే, కళ్యాణ్ లలోని రెండు స్థానాలను కలిపి ముంబై చుట్టుపక్కల సుమారు ఎనిమిది స్థానాలు ఉన్నాయని, వాటిలో రెండింటిలో పోటీ చేయడానికి అభ్యర్థులను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. అలాగే, పుణె, బీడ్, నాందేడ్, బుల్ధానా స్థానాల్లో కూడా ఎంఐఎం అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది.