BRS Meeting: మహారాష్ట్రపై బీఆర్ఎస్ ఫోకస్, నేడు ఔరంగాబాద్ లో భారీ సభ
BRS Meeting: మహారాష్ట్ర ఔరంగాబాద్ లో సోమవారం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
BRS Meeting: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్రపై గురిపెట్టారు. వరుసగా సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ లో చేరికలు కూడా పెరిగాయి. బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్లాన్ చేస్తు్న్న కేసీఆర్.. మహారాష్ట్రలో మరో సభ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర పరిధిలో బీఆర్ఎస్ రెండు సార్లు బహిరంగ సభలు నిర్వహించింది. ఈ సభలకు స్పందన రావడంతో మరోసభకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. సోమవారం ఔరంగాబాద్ శంభాజీనగర్ లో బీఆర్ఎస్ మూడో బహిరంగ సభ జరగనుంది. సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నాయి పార్టీ శ్రేణులు.
రెండు సభలు సక్సెస్
మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లా శంభాజీనగర్‌లో బీఆర్‌ఎస్ చేపట్టిన సభకు స్థానికుల నుంచి విశేష స్పందన వస్తుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ బహిరంగ సభపై జిల్లా కేంద్రంలోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లో జోరుగా చర్చ జరుగుతుందంటున్నాయి. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహిస్తున్న మూడో సభపై అందరిలోనూ ఉత్సుకత నెలకొందంటున్నారు.
ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్‌ఎస్ మొదటి సభ నిర్వహించింది. ఈ సభ సక్సెస్ అవ్వడంతో మార్చి 26న చిన్న తాలుకా కేంద్రమైన లోహలో మరో సభ నిర్వహించింది. దీంతో సోమవారం శంభాజీ నగర్ జిల్లా కేంద్రంలో మూడో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. శంభాజీనగర్ పట్టణ కేంద్రంలోని జబిందా ఎస్టేట్స్‌లో సభ ఏర్పాటుచేశారు. ఇప్పటికే పట్టణమంతా కేసీఆర్ భారీ కటౌట్లు వెలిశాయి. ప్రధాన రహదారుల వెంబడి బీఆర్ఎస్, కేసీఆర్ హోర్డింగులతో ఏర్పాటుచేశారు.
బీఆర్ఎస్ కు మహారాష్ట్ర పోలీసులు షాక్
అయితే ముందుగా అంఖాస్ మైదానంలో తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పలు భద్రతా కారణాల రీత్యా అంఖాస్ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు. ఔరంగాబాద్ లోని మిలింద్ కాలేజీ దగ్గర్లో సభ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కానీ అంఖాస్ మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఇలాంటి దశలో పోలీసులు షాక్ ఇవ్వటంపై బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే అదే రోజు ఎలాగైనా సభను నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్.. ఔరంగాబాద్ లోని బిడ్ బైపాస్ రోడ్డు దగ్గరలో ఉన్న జంబిదా మైదానంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జంబిదా గ్రౌండ్ లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు.
సంబంధిత కథనం