AIMIM : రూట్ మార్చిన ఎంఐఎం, కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైన అసదుద్దీన్?-hyderabad news in telugu aimim president asaduddin owaisi close to congress in front of lok sabha elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aimim : రూట్ మార్చిన ఎంఐఎం, కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైన అసదుద్దీన్?

AIMIM : రూట్ మార్చిన ఎంఐఎం, కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైన అసదుద్దీన్?

HT Telugu Desk HT Telugu
Mar 10, 2024 09:13 PM IST

AIMIM : హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయమే లక్ష్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పావులు కదుపుతున్నారు. బీజేపీ అభ్యర్థిని ఎదుర్కోనేందుకు కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ తో ఎంఐఎం దోస్తీ?
కాంగ్రెస్ తో ఎంఐఎం దోస్తీ?

AIMIM : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీ రాజకీయలు రసవత్తరంగా మారుతున్నాయి. సరికొత్త ఎత్తులు, పై ఎత్తులతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దగ్గర అవుతుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇటీవలే పాతబస్తీలో మెట్రో రైలు(Old city Metro) పనుల శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ లోక్ సభ నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్ పార్టీ ఈసారి కూడా నూటికి నూరు శాతం తమదే విజయం అని ధీమాతో ఉన్నా.....ఇటు బీజేపీని అటు ఎంబీటీ పార్టీలను ఎదురుకునేందుకు ఒవైసీ కొత్త ఎత్తుగడలను మారుస్తున్నారు.

ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని ప్రశాంతంగా నడపండి- అసదుద్దీన్

విరించి హాస్పిటల్స్ ఛైర్మెన్ మాధవి లతకు(Madhavi Latha) బీజేపీ అధిష్టానం హైదరాబాద్ టికెట్ ఇవ్వడంతో మజ్లిస్ పార్టీ అప్రమత్తమైంది. దీనికి పాతబస్తీ ఫలాక్ నామాలో సీఎం శంకుస్థాపన వేదికపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అభిప్రయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో గత కొన్నాళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న మజ్లిస్ పార్టీ దోస్తానా కోసం తన స్వరం మార్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలక్ నామాలోని బహిరంగసభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ....... " సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మొండి వాడు ఆయన మొండి తనమే ఆయన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను నా పార్టీ వాళ్లు తల తిక్కొల్లం అయినప్పటికీ మరో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హాయిగా నడిపేందుకు మేము పూర్తిగా సహకరిస్తాం" అంటూ అసదుద్దీన్(Asaduddin Owaisi) వ్యాఖ్యానించారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....మజ్లిస్ పార్టీని ఓడించేందుకు చాలా ప్రయత్నాలే చేశాం కానీ వీలు కాలేదు. ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధి పైనే మా దృష్టి అంతా " అని ఆయన తెలిపారు.

బీఆర్ఎస్ తో మజ్లిస్ స్నేహం కొనసాగనుందా?

ఒకవేళ ఎంఐఎం(MIM) కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయితే హైదరాబాద్ పార్లమెంటరీ(Hyderabad Paliament Seat) స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని ఎన్నికల బరిలో దించి పావులు కదుపుతుందా? ఒకవేళ అదే నిజమైతే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి అని చర్చ పాత బస్తీ రాజకీయాల్లో జోరుగా జరుగుతుంది. బీఆర్ఎస్ తో కూడా దోస్తానా కొనసాగించి హైదరాబాద్ వరకు తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపి గులాబీ పార్టీ సహకరిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి డమ్మీ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగితే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మజ్లీస్ పార్టీ భావిస్తుంది.

బీజేపీ, ఎంబీటీ పార్టీలను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ తో మజ్లిస్ దోస్తీ?

మరోవైపు హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న మజ్లీస్ బచావో పార్టీ(MBT), కాంగ్రెస్ పార్టీ(Congress) నుంచి తమకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని గంపెడు ఆశలతో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యకుత్ పురా నియోజకవర్గ నుంచి కేవలం 878 ఓట్ల తేడాతో పరాజయం పాలైనా..... మజ్లీస్ పార్టీకి మాత్రం చుక్కలు చూపించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి అంజధులా ఖాన్ సైతం హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నేశారు. ఇప్పటి నుంచే స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజలకు దగ్గరవుతున్నారు. అటు ఎంబీటీతో పాటు ఇటు బీజేపీ అభ్యర్థిని ఎన్నికల బరిలో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడమే రాజకీయంగా కలిసి వస్తుంది అని భావించిన మజ్లిస్ పార్టీ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ వ్యూహాలు రచిస్తోంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point

సంబంధిత కథనం