Arunachal assembly polls : అరుణాచల్ ప్రదేశ్లో గెలిచిన 22శాతం మందిపై క్రిమినల్ కేసులు..!
03 June 2024, 14:47 IST
Arunachal assembly election results : అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 59 మంది అభ్యర్థులలో, 13 (22%) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాలు..
అరుణాచల్ ప్రదేశ్లో గెలిచిన 22శాతం మందిపై క్రిమినల్ కేసులు..!
Arunachal assembly elections : అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల్లో కనీసం 22శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 2024లో గెలిచిన 59 మంది అభ్యర్థుల్లో 13 మంది (22%).. తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వారివారి అఫిడవిట్లలో ప్రకటించారు.
అదనంగా.. 20% (12 మంది అభ్యర్థులు) తీవ్రమైన క్రిమినల్ కేసులను అఫిడవిట్లో చూపించారు. 2019లో ఇది 13% (60 లో 8)గా ఉండేది.
ఈసీఐ వెబ్సైట్లో స్పష్టమైన, పూర్తి అఫిడవిట్ అందుబాటులో లేకపోవడంతో ఏడీఆర్ ఒక అభ్యర్థిని విశ్లేషించలేకపోయింది.
ఏడిఆర్ నివేదిక ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల్లో 20% (45 మందిలో 9) క్రిమినల్ కేసులు ఉన్నాయి. 18% (8 మంది అభ్యర్థులు) తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) గెలిచిన అభ్యర్థుల్లో 20% (5 మందిలో ఒకరు) తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటిస్తున్నారు. ఎన్సీపీ గెలిచిన వారిలో 67% మంది (ముగ్గురిలో ఇద్దరు) క్రిమినల్ కేసులతో ఉన్నారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) గెలిచిన అభ్యర్థి ఒకరు ఉన్నారు. అతను క్రిమినల్, తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించాడు.
ఈ ఏడాది కోటీశ్వరుల సంఖ్య పెరగడాన్ని కూడా నివేదిక గుర్తించింది.
Arunachal assembly election results 2024 : గెలిచిన అభ్యర్థుల్లో 97 శాతం (59 మందిలో 57 మంది) కోటీశ్వరులు కాగా, 2019లో 93 శాతం (60 మందిలో 56 మంది) నుంచి పెరిగారు.
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఎన్సీపీ, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు వంటి పార్టీలు తమను తాము కోటీశ్వరులుగా ప్రకటించుకున్నాయి.
పార్టీల వారీగా చూస్తే బీజేపీకి రూ.25.83 కోట్లు, ఎన్పీపీకి రూ.17.45 కోట్లు, ఎన్సీపీకి రూ.74.13 కోట్లు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్కు రూ.10.32 కోట్లు, కాంగ్రెస్కు రూ.41.96 కోట్లు, స్వతంత్ర అభ్యర్థులకు రూ.6.45 కోట్ల సగటు ఆస్తులు ఉన్నాయి.
రూ.332.56 కోట్లతో పెమా ఖండూ (బీజేపీ), రూ.153.31 కోట్లతో నిఖ్ కమిన్ (ఎన్సీపీ), రూ.126.20 కోట్లతో చౌనా మెయిన్ (బీజేపీ) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
Arunachal assembly elections ADR : అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారమే వెలువడ్డాయి. ఇక లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఆ తర్వాత.. క్రిమినల్ కేసులు ఉన్న ఎంతమంది ఎంపీలు అయ్యారో వేచి చూడాలి.
అరుణాచల్ ప్రదేశ్- సిక్కిం ఎన్నికల ఫలితాలు..
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 60 సీట్లల్లో 46 చోట్ల గెలిచింది. ఎన్పీపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్కు 1 సీటు, ఇతరులకు 8 సీట్లు దక్కాయి.
2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి భారీ విజయం దక్కింది. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. మొత్తం 32 సీట్లున్న అసెంబ్లీల్లో ఇప్పుడు ఎస్కేఎంకు చెందిన 31 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.