Lok Sabha Elections 2024: 2014 నుంచి 100% పెరిగిన రాజకీయ పార్టీల సంఖ్య; క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య కూడా..-which party has candidates with most criminal cases in ls polls details here ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024: 2014 నుంచి 100% పెరిగిన రాజకీయ పార్టీల సంఖ్య; క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య కూడా..

Lok Sabha Elections 2024: 2014 నుంచి 100% పెరిగిన రాజకీయ పార్టీల సంఖ్య; క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య కూడా..

HT Telugu Desk HT Telugu
May 29, 2024 04:38 PM IST

Lok Sabha Elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 8,337 మంది అభ్యర్థుల్లో 20 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్లలో వెల్లడించారు. 14 శాతం మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు సంబంధించిన అభియోగాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

100 శాతం పెరిగిన రాజకీయ పార్టీల సంఖ్య
100 శాతం పెరిగిన రాజకీయ పార్టీల సంఖ్య (AP)

Lok Sabha Elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏడు దశల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జూన్ 1న 57 పార్లమెంట్ స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

మొత్తం 8,360 మంది అభ్యర్థులు

ప్రస్తుత లోక్ సభ ఎన్నికల బరిలో ఏడు దశల్లో కలిపి 8,360 మంది అభ్యర్థులున్నారు. వారిలో 8,337 మంది అఫిడవిట్ లను ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ విశ్లేషించింది. వీరిలో జాతీయ పార్టీల నుంచి 1,333 మంది, రాష్ట్ర పార్టీల నుంచి 532 మంది, గుర్తింపు లేని పార్టీల నుంచి 2,580 మంది, స్వతంత్రంగా 3,915 మంది అభ్యర్థులు ఉన్నారు.

751 రాజకీయ పార్టీలు

2024 లోక్ సభ ఎన్నికల్లో 751 రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 677 రాజకీయ పార్టీలు, 2014లో 464 రాజకీయ పార్టీలు, 2009 లోక్ సభ ఎన్నికల్లో 368 రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. అంటే 2009 నుంచి 2024 మధ్య రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని ఏడీఆర్ తెలిపింది.

క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు

2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల క్రిమినల్ నేపథ్యం గురించి ఈ విశ్లేషణ వెల్లడించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8337 మంది అభ్యర్థుల్లో 1,643 మంది (20 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 7928 మంది అభ్యర్థుల్లో 1500 మంది (19 శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో విశ్లేషించిన 8205 మంది అభ్యర్థుల్లో 1404 మంది (17 శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2009 లోక్ సభ ఎన్నికల సమయంలో విశ్లేషించిన 7810 మంది అభ్యర్థుల్లో 1158 మంది (15 శాతం) తమపై క్రిమినల్ కేసులు తమ అఫిడవిట్లలో ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది.

తీవ్రమైన క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు

2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,191 మంది (14 శాతం) అభ్యర్థులపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ గుర్తించింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో విశ్లేషించిన 7928 మంది అభ్యర్థుల్లో 1070 మంది (13 శాతం) అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8205 మంది అభ్యర్థుల్లో 908 మంది (11 శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 7810 మంది అభ్యర్థుల్లో 608 మంది (8 శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడైంది.

పార్టీల వారీగా క్రిమినల్ నేపథ్యం..

పార్టీల వారీగా చూస్తే, 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో.. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన 440 మంది అభ్యర్థుల్లో 191 మంది (43 శాతం), కాంగ్రెస్ నుంచి 327 మంది అభ్యర్థుల్లో 143 మంది (44 శాతం), బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన 487 మంది అభ్యర్థుల్లో 63 మంది (13 శాతం), సీపీఐ (ఎం) బరిలోకి దిగిన 52 మంది అభ్యర్థుల్లో 33 (63 శాతం), 3 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 550 మంది (14 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

నేరం రుజువైతేనే..

మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను 197 మంది అభ్యర్థులు ప్రకటించారు. వీరిలో 16 మంది అభ్యర్థులు అత్యాచారానికి సంబంధించిన అభియోగాలను (ఐపీసీ సెక్షన్ -376) ఎదుర్కొంటున్నారు. ఒకే మహిళపై పదేపదే అత్యాచారానికి పాల్పడిన వారికి పదేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. కాగా, తమపై ఉన్న నేరాభియోగాలు రుజువై దోషిగా తేలితేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉండదు. దోషులుగా తేలితే, జైలు టర్మ్ ముగిసిన తరువాత, ఆరేళ్ల పాటు వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉండదు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఒక వ్యక్తి నేరం రుజువయి రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడితే, విడుదలైన తేదీ నుంచి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. ఈ నిబంధనను ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8లో పేర్కొన్నారు.

జూన్ 4 న ఫలితాలు

మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గాను ఇప్పటివరకు ఆరు దశల్లో 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ మే 25న జరిగింది. 400 సీట్లు గెలుచుకుని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తోంది. అధికార కూటమి ఎన్డీఏకు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి పేరుతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు బరిలో నిలిచాయి.

Whats_app_banner