Bullet Sounds: బుల్లెట్‌ బండి చప్పుడు చేస్తే బెండు తీస్తరు, సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు. లైసెన్స్ రద్దు-criminal cases if bullet bike silencers are changed cancellation of license ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bullet Sounds: బుల్లెట్‌ బండి చప్పుడు చేస్తే బెండు తీస్తరు, సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు. లైసెన్స్ రద్దు

Bullet Sounds: బుల్లెట్‌ బండి చప్పుడు చేస్తే బెండు తీస్తరు, సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు. లైసెన్స్ రద్దు

HT Telugu Desk HT Telugu
May 23, 2024 07:22 AM IST

Bullet Sounds: బుల్లెట్‌ బళ్లపై వింత శబ్దాలు వచ్చేలా సైలెన్సర్లు మారుస్తున్న వారిపై వరంగల్ పోలీసులు కొరడా ఝుళిపించారు. బైక్‌ సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

బైక్‌ సైలెన్సర్లను ధ్వంసం చేస్తున్న వరంగల్ పోలీసులు
బైక్‌ సైలెన్సర్లను ధ్వంసం చేస్తున్న వరంగల్ పోలీసులు

Bullet Sounds: ఎంతో ఇష్టంగా బైకులు కొనే కొంత మంది యువకులు, స్టూడెంట్స్ దాని ‌ఇంజన్‌ శబ్దం మారేందుకు సైలెన్సర్లు మార్చేస్తుంటారు. ముఖ్యంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ లాంటి బండ్లు పెద్ద శబ్ధం వచ్చేలా సైలెన్సర్లు మార్చడంతో పాటు డ్రైవింగ్ లో షాట్స్ కూడా ఇస్తుంటారు.

ఇక మీదట వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇష్టమొచ్చినట్లుగా సైలెన్సర్లుగా మార్చేస్తామంటే కుదరదు! డుగ్.. డుగ్.. మంటూ పెద్ద ఎత్తున శబ్ధం వచ్చేలా సైలెన్సర్లు మార్చడం, సౌండ్ తో జనాలకు ఇబ్బందులు కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు వరంగల్ పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ మేరకు సైలెన్సర్లు మారిస్తే బండి ఓనర్ తో పాటు మార్చిన మెకానిక్ పైనా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.

మూడు నెలల పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల వరంగల్ ట్రై సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను మళ్లీ పనికి రాకుండా బుధవారం రోడ్డు రోలర్ తో తొక్కించేశారు.

ట్రై సిటీలో 261 సైలెన్సర్లు ధ్వంసం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ఇటీవల ట్రై సిటీలో బైక్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో పెద్ద శబ్దం వచ్చే వాటిని ఏర్పాటు చేసిన బండ్లపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగానే వరంగల్ ట్రై సిటీలో ప్రత్యేక తనీఖీల్లో నిర్వహించి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్రై సిటీ వ్యాప్తంగా మొత్తం 261 సైలెన్సర్లు స్వాధీనం చేసుకోగా.. అందులో వరంగల్ ప్రాంతానికి చెందినవి 100, హనుమకొండకు చెందినవి 73, కాజీపేటకు చెందినవి 88 ఉన్నాయి. ఇలా పోలీసులు స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ సమీపంలో రోడ్డు రోలర్ సాయంతో తొక్కించి ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధమైన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా వాటిని తుక్కుతుక్కుగా చేశారు.

క్రిమినల్ కేసులు.. లైసెన్సులు రద్దు: ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ

బైక్ ఓనర్లు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మారిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. సైలెన్సర్ మారిస్తే బండి ఓనర్ తో పాటు మార్చిన మెకానిక్ పైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

బుధవారం సైలెన్సర్లు ధ్వంసం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికంగా శబ్దం చేసే బైకులపై ప్రత్యేక దృష్టి సారించి తనీఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.

బైక్ యజమానులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. వాహనదారులు ఎవరైనా సైలెన్సర్ మార్చితే మాత్రం ఓనర్ తో పాటు మెకానిక్ పైగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా ఆర్టీవో అధికారులను సంప్రదించి, వాహనదారుల లైసెన్స్ ను మూడు నెలల పాటు రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు.

బండిని కూడా సీజ్ చేస్తామని తేల్చి చెప్పారు. బైక్ మెకానిక్ లు కూడా ఇలాంటి ప్రోత్సహించవద్దని, సైలెన్సర్లు మార్చి అనవసర చిక్కుల్లో పడొద్దని హెచ్చరించారు. ఆయన వెంట ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్, హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ సీఐలు శ్రీధర్ , షుకూర్ , నాగబాబు, ట్రాఫిక్ ఎస్సైలు పూర్ణ చంద్రారెడ్డి, యుగంధర్ ఇతర ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

సంబంధిత కథనం