Mizoram election results : సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన సీఎం.. అధికార పక్షం ఇంటికి!
04 December 2023, 14:40 IST
- Mizoram election results : మిజోరం ఎన్నికల్లో అధికార పక్షం దారుణంగా విఫలమైంది. మరీ ముఖ్యంగా.. సీఎం జోరంథంగ.. తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.
సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన సీఎం..
Mizoram election results 2023 : మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రెంట్ (ఎమ్ఎన్ఎఫ్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. మరీ ముఖ్యంగా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జోరంథంగ.. తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఎమ్ఎన్ఎఫ్లో చాలా మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కూడా కోల్పోయారు.
మిజోరం ఎన్నికల ఫలితాలు 2023..
మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. మెజారిటీకి కావాల్సిన సీట్లు 21. మ్యాజిక్ ఫిగర్‌ని ఆరు పార్టీల విపక్ష కూటమి జెడ్పీఎం (జోరం పీపుల్స్ మూవ్మెంట్) సునాయాసంగా అందుకుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నాటికి.. జెడ్పీఎం.. 26 సీట్లల్లో గెలుపొందింది. మరో సీటులో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార పక్షంగా బరిలో దిగిన ఎమ్ఎన్ఎఫ్.. కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. మరో 3 సీట్లల్లో లీడ్‌లో ఉంది. ఇవి గెలిస్తేనే, ఆ పార్టీ రెండంకెల మార్క్‌ను అందుకోగలుగుతుంది! బీజేపీ రెండు చోట్ల గెలుపొందింది. ఇక కాంగ్రెస్.. ఒక్క సీటుతో సరిపెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
Mizoram election results live updates : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి మించి ఎమ్ఎన్ఎఫ్ బాధపడాల్సిన విషయం ఏదైనా ఉందంటే.. అది సీఎం జోరంథంగ వైఫల్యం! ఐజ్వాల్ ఈష్ట్-1 నుంచి పోటీ చేసిన ఆయన.. ఓడిపోయారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా పనిచేసిన టాన్లుయా సైతం.. టుచాంగ్ నియోజకవర్గంలో ఓడిపోయారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు..!
ఈ దఫా ఎన్నికల్లో ఎమ్ఎన్ఎఫ్, జెడ్పీఎంలు, కాంగ్రెస్ పార్టీలు 40 సీట్లల్లో పోటీ చేశాయి. బీజేపీ కేవలం 13 చోట్ల బరిలో దిగింది. జాతీయ పార్టీగా శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తొలిసారిగా మిజోరంలో పోటీ చేసింది. నాలుగు చోట్ల తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొత్తం 17 మంది స్వతంత్రులు సైతం పోటీ చేశారు.
Mizoram election results live : ఇక మిజోరంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అనేక ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. కొన్ని మాత్రమే.. జెడ్పీఎం హవా కొనసాగుతుందని అభిప్రాయపడ్డాయి.
2018 ఎన్నికల్లో ఎమ్ఎన్ఎఫ్కు 26 సీట్లు వచ్చాయి. జెడ్పీఎంకు 8 స్థానాల్లో విజయం వరించింది. కాంగ్రెస్ 5 చోట్ల, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి.