తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mizoram Election 2023: అక్కడ ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది ఆ అంశమేనా?

Mizoram election 2023: అక్కడ ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది ఆ అంశమేనా?

HT Telugu Desk HT Telugu

27 October 2023, 20:18 IST

google News
  • Mizoram election 2023: మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణల కారణంగా చోటు చేసుకుంటున్న హింస ప్రభావం మిజోరం ఎన్నికలపై (Mizoram election 2023) కచ్చితంగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mizoram election 2023: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7వ తేదీన జరగనున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ (Mizo National Front MNF) అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఎంఎన్ఎఫ్ తో పాటు కాంగ్రెస్, జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదన్నది తేల్చేది రాష్ట్రం ఎదుర్కొంటున్న శరణార్ధుల అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మణిపూర్ హింస

మణిపూర్ లో కుకి, మైతీ తెగల మధ్య గత 5 నెలలుగా తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ అంశం పొరుగున ఉన్న మరో ఈశాన్య రాష్ట్రం మిజోరం ఎన్నికలపై ప్రభావం చూపనుంది. మిజోరంలో మొత్తం 72 వేల మంది శరణార్ధులు ఉన్నారు. వారిలో 12,600 మంది మణిపూర్ నుంచి వచ్చిన కుకీలు. మిగతా సుమారు 60 వేల మంది మయన్మార్ నుంచి వచ్చిన శరణార్ధులు. మయన్మార్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి మిలటరీ పాలన ప్రారంభమైన 2021 ఫిబ్రవరి తరువాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున శరణార్ధులు మిజోరం వచ్చారు.

మిజోరం ఎన్నికలు..

చిన్న రాష్ట్రమైన మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజారిటి పొందడానికి గెలుపొందాల్సిన స్థానాల సంఖ్య 21. రాష్ట్రంలో మొత్తం 851,895 ఓటర్లు ఉన్నారు. వారిలో 438,925 మంది స్త్రీలు, 412,969 మంది పురుషులు. ఇక్కడ పురుష ఓటర్ల కన్నా స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. అందుకే కాబోలు, ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

శరణార్ధుల అంశం..

ఈ ఎన్నికల్లో శరణార్ధుల అంశం కీలకంగా మారింది. శరణార్థుల అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని విపక్ష కాంగ్రెస్ జడ్పీఎం విమర్శిస్తున్నాయి. అయితే, ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని, శరణార్ధుల కోసం రూ. 30 కోట్లు ఖర్చు పెట్టామని ఎంఎన్ఎఫ్ చెబుతోంది. శరణార్ధుల నుంచి, ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చిన వారి నుంచి బయోమెట్రిక్స్ సేకరించకపోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే, మానవీయ కోణంలో ఆలోచించి, ఆ పని చేయలేదని ఎంఎన్ఎఫ్ వాదిస్తోంది. ఆ బయోమెట్రిక్ డేటా ఆధారంగా వారిని దేశం నుంచి పంపించే ప్రమాదముందని వివరిస్తోంది. ఎంఎన్ఎఫ్ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కావడం గమనార్హం. బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ.. ఎంఎన్ఎఫ్ ఉమ్మడి పౌరస్మృతిని, సీఏఏను వ్యతిరేకిస్తోంది. అస్సాంతో మిజోరంకు ఉన్న సరిహద్దు వివాదం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే కీలకం అంశంగా మారింది. 2018లో అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఓడించి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది.

తదుపరి వ్యాసం