Chandrababu : వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వైసీపీకి పనిచేయొద్దు- చంద్రబాబు
04 March 2024, 21:31 IST
- Chandrababu : టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తామన్నారు.
చంద్రబాబు
Chandrababu : వాలంటీర్ వ్యవస్థ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu On Volunteers) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ (TDP)'రా కదలిరా' బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి సిద్ధమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పింఛన్ (Pensions)విధానాన్ని ప్రారంభించిందే టీడీపీ ప్రభుత్వం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు... వాలంటీర్లు వైసీపీ(Ysrcp) దొంగలకు పనిచేయొద్దన్నారు.
వేధించిన వారి లెక్కలు సెటిల్ చేస్తాం
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమకు(Rayalaseema) తెచ్చిన పెట్టుబడులు ఏంటో జగన్ చెప్పాలన్నారు. వివేకా హత్య కేసులో పిల్లిమొగ్గలు వేస్తుంది ఎవరో? జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి కారణం ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఎర్రగుట్టను మింగేసి వ్యక్తి, ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు కేతిరెడ్డి(Ketireddy) అంటూ ఫైర్ అయ్యారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి దందాలు, దౌర్జన్య లెక్కలు తన వద్ద ఉన్నాయన్నారు. అందరి అకౌంట్స్ సెటిల్ చేస్తానన్నారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు అన్నారు. జగన్ (Jagan)పెట్టిన స్కీమ్ లన్నీ స్కాముల కోసమేనని విమర్శించారు. ఈ ఐదేళ్లలో జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. జగన్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
కియా పరిశ్రమతో 50 వేల మందికి ఉపాధి
అనంతపురం(Anantapur)జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని చంద్రబాబు అన్నారు. కరవు జిల్లాను సస్యశ్యామం చేయాలని టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయించామన్నారు. కియా పరిశ్రమ తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. సాగునీరు ఇస్తే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని చంద్రబాబు అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేశామన్నారు. కియా (Kia)పరిశ్రమలో ఇప్పటి వరకూ 12 లక్షల కార్లు తయారయ్యాయని, దీంతో 50 వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్న జగన్ ను ఇంటికి పంపాల్సిన టైం వచ్చిందన్నారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ... సిద్ధమంటున్న జగన్ తాము అడిగే ప్రశ్నలకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.
రాష్ట్రం మీ తాత జాగీర్ కాదు
ఐదేళ్ల టీడీపీ హయాంలో కియా పరిశ్రమ తెచ్చామని చంద్రబాబు అన్నారు. పదేళ్లు టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కియా రోడ్డంతా పరిశ్రమలు వచ్చేవి అన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని తన తాత జాగీర్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నాలెడ్జ్ హబ్ లో సీఎం జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్ హయాంలో పెట్టిన లేపాక్షి నాలెడ్జ్ సిటీ, సైన్స్ సిటీ వల్ల ఒక్కరికీ ఉద్యోగం రాలేదని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ అవినీతి ఎమ్మెల్యేలు ట్రాన్స్ ఫర్ అయ్యారని ఎద్దేవ చేశారు. కళ్యాణ దుర్గాన్ని సర్వం దోచుకున్న మంత్రి ఉష శ్రీ.. పెనుకొండకు వచ్చారన్నారు.