Chandrababu : టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్, వైసీపీ చీటింగ్ టీమ్- చంద్రబాబు
28 February 2024, 19:56 IST
- Chandrababu : టీడీపీ అగ్నికి జనసేన వాయువు తోడై వచ్చే ఎన్నికల్లో వైసీపీ భస్మం చేస్తుందని చంద్రబాబు అన్నారు. పొత్తులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నారు.
చంద్రబాబు
Chandrababu : టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్, వైసీపీ చీటింగ్ టీమ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో(Tadepalligudem Meeting) నిర్వహించిన తెలుగు జన విజయ కేతనం జెండా సభలో చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ అగ్నికి జనసేన వాయువు తోడై వచ్చే ఎన్నికల్లో వైసీపీని తగలబెడుతుందన్నారు. టీడీపీ, జనసేన(TDP Janasena) అభ్యర్థులు విద్యా వంతులైతే ... వైసీపీ అభ్యర్థులు రౌడీలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడాలన్నారు. తొందర్లోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. పొత్తును విచ్చిన్నం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు. టికెట్ ఆశించిన వారందరికీ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. సీట్లు ఇవ్వలేకపోయినా... ప్రతి ఒక్కరి న్యాయం చేస్తామన్నారు. ఈ పొత్తులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదన్నారు. ఒకరి వెనుక మరొకరు నడవలేదని, రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాయన్నారు.
సొంత చెల్లికే వేధింపులు
రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి అడుగులు వేస్తున్నామని చంద్రబాబు అన్నారు. టీడీపీ, జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్‌స్టాపబుల్ కావాలంటే వైసీపీ విధ్వంసానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేస్తే, దానిని నాశనం చేశారన్నారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన చేస్తే జగన్ అరాచకాలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన జగన్... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక భారత క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. సొంత చెల్లి వేరే పార్టీలో చేరితే సోషల్‌మీడియాలో ఆమె వేధించేలా పోస్టులు పెట్టిస్తున్నారన్నారు. సీఎం జగన్ మానసిక పరిస్థితే ఈ ఘటనలకు నిదర్శనం అన్నారు.
జగన్ పాలన అట్టర్ ఫ్లామ్
జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా అని చంద్రబాబు విమర్శించారు. అలాంటి సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కూటమి సూపర్ హిట్ అన్నారు. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న సీఎం జగన్ ఎందుకు తేలేకపోయారు. కుప్పం నియోజకవర్గంలో నీళ్లు ఇచ్చామని సినిమా సెట్టింగ్ లు వేసి మరుసటి రోజుకు నీళ్లు మాయం అయ్యాయన్నారు. కుప్పంలో నీళ్ల పేరిట జగన్ నాటకాలు ఆడారన్నారు. తాడేపల్లిగూడెం సభతో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని అర్థమైందని చంద్రబాబు అన్నారు. ఏపీ అభివృద్ధికి మా వద్ద బ్లూప్రింట్ ఉందన్నారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు. కూటమి కారణంగా కొందరికి సీట్లు ఇవ్వలేకపోయామన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు.