Postal Ballots Trend: ఏపీలో 5లక్షలకు చేరువలో పోస్టల్ బ్యాలెట్లు, నేడు కూడా ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
10 May 2024, 11:36 IST
- Postal Ballots Trend: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల నమోదులో కొత్త రికార్డు నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. నేడు కూడా పోలింగ్ జరుగనుండటంతో 5లక్షలకు చేరువలో ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు
Postal Ballots Trend: ఏపీలో పోస్టల్ బ్యాలెట్లు కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. గత ఎన్నికలకు భిన్నంగా 2019 కంటే రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి.
ఎన్నికల విధుల్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు సార్వత్రిక ఎన్నికల్లో బారులు తీరారు. గతానికి భిన్నంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించారు.
గురువారం సాయంత్రానికి పోస్టల్‌లో బ్యాలెట్లలో దాదాపు 5లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకే పరిమితమైన పోస్టల్ బ్యాలెట్ సదుపాయం తాజాగా అత్యవసర విధుల్లో ఉండే అందరికి ఇచ్చారు. ఇది కూడా ఓట్ల సంఖ్య పెరగడానికి కారణమైంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 2,38,468 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. 2024 ఎన్నికల్లో మే 4 నుంచి 8వ తేదీ వరకు 4,32,222 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. 9వ తేదీన జరిగిన పోలింగ్‌తో పాటు శుక్రవారం జరిగే పోలింగ్ కూడా కలుపుకుంటే 5లక్షల ఓట్లు దాటతాయని అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి పూర్తి లెక్కలు వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐదు రోజులుగా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లలో క్యూలైన్లలో నిలబడి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్యోగుల ఓట్లు గల్లంతు కావడంతో స్పాట్‌లో రిజిస్ట్రేషన్ చేసి ఓటు వేయడానికి ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 8వ తేదీ వరకు 4,32,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గురువారం ఎన్నికల విధుల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లకు తరలి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారని విపక్షాలు చెబుతున్నాయి.
జిల్లాల వారీగా పార్లమెంటు సెగ్మెంట్లలో నమోదైన ఓట్లను చూస్తూ అరకు పార్లమెంటు పరిధిలో 17,958, శ్రీకాకుళంలో 23,574, విజయనగరంలో 18,472, విశాఖపట్నంలో 19,609, అనకాపల్లిలో 16,972, కాకినాడలో 17,092, అమలాపురంలో 14,397, రాజమండ్రిలో 14,120, రాజమండ్రిలో 14,120, నరసాపురంలో 13,177, ఏలూరులో 14,945, మచిలీపట్నంలో 17,150, విజయవాడలో 17,420, గుంటూరులో 19,255, నరసరావుపేటలో 17,544, బాపట్లలో 16,130, ఒంగోలులో 18,032, నంద్యాలలో 18,308, కర్నూలులో 16,316, అనంతపురం 18,540, హిందుపూర్‌లో 17,361, కడపలో 14,562, నెల్లూరులో 22196, తిరుపతిలో 14,874, రాజంపేటలో 18,390, చిత్తూరులో 15,826 ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం కూడా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.