Postal Ballots: స్పాట్‌లోనే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఈసీ ఆదేశం..ఉద్యోగుల ఓట్ల గల్లంతుపై కీలక అప్డేట్
06 May 2024, 10:33 IST
- Postal Ballots: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు ఎక్కడికక్కడ స్పాట్‌లోనే జారీ చేయాలని ఈసీ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు. మునుపెన్నడు లేని విధంగా పోస్టల్ బ్యాలెట్లకు ఉద్యోగులు పోటెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.
పోస్టల్ బ్యాలెట్ కోసం విజయవాడలో ఏర్పాట్లు
Postal Ballots: రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలో పలువురు ఉద్యోగుల ఓట్లు గల్లంతు కావడంతో పలు జిల్లాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల ఓటు హక్కును తిరస్కరించరాదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించు కునేందుకు జిల్లా కేంద్రాాలకు తరలి వస్తున్నారు. శని, ఆదివారాల్లో పలువురు ఉద్యోగులు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదు చేయడంతో ఈసీ తక్షణం స్పందించింది.
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్ లోనే ఫార్మ్ 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు.
ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం-12ను సకాలంలో సమర్పించ లేకపోవడంతో తమ ఓటును వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు సీఈఓ తెలిపారు.
అనివార్య పరిస్థితుల కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఓటరు మే 1వ తేదీలో లోపు ఫారమ్-12ను సమర్పించలేకపోతే, ఎక్కడ ఓటు నమోదు చేసుకున్నారో ఆ ఆర్వో పరిధిలో, రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫార్మ్ 12 సమర్పించేందుకు, అదే కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అనుమతించాలని కలెక్టర్లను సీఈఓ ఆదేశించారు.
ఈ నెల 7 మరియు 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫెసిలిటీషియన్ కేంద్రాలు పని చేస్తాయని ఆయన తెలిపారు. ఓటు వేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు చేసిన స్పెషల్ క్యాజువల్ లీవ్ ను సద్వినియోగం చేసుకుని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లో ఓటు హక్కు అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ECI మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఓటర్లందరి ఓటు హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకునేలా ఆర్వోలు అందరూ సహకరించాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల వివరాలు, ఎలక్షన్ డ్యూటీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను నిర్ణీత ధృవీకరణ తర్వాత మరియు పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే జారీ చేయలేదని నిర్ధారించుకుని ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతించాలని ఆర్వోలకు సూచించారు.
ECI మార్గదర్శకాల అమల్లో ఏమైనా తేడా వస్తే అందుకు సంబంధిత ఆర్వోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
జాబితా వెల్లడించాలని ఉద్యోగుల డిమాండ్…
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల జాబితాలను జిల్లాల వారీగా వెల్లడించాలని, ఎంతమందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారో ప్రకటించలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించారు.
ఆర్వోల పరిధిలో విధుల్లో ఉన్న ఉద్యోగులందరిని ఓటు వేసేందుకు అనుమతించాలని ఓట్లు గల్లంతు చేస్తున్నారనే ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఫారం 12 ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో లెక్కలు జిల్లాల వారీగా వెల్లడించాలన్నారు.
నియోజక వర్గం వారీగా ఆ జిల్లా పరిధిలో ఎంతమంది ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయించారు? ఎంతమందికి ఫారం -12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ సంబంధిత ఆర్ ఓ లు ఇవ్వబోతున్నారో నేటికీ స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదని, సమాచారం ఇవ్వాలని ఏప్రిల్ 26న ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు.
ఏప్రిల్ 30, మే1 తేదీలలో ఎన్నికల విధులకు నియమించిన కాంట్రాక్టు, అంగన్ వాడి ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలన్నారు. వారికి ఫారం - 12 ఇవ్వలేదని ఆరోపించారు. వారందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.