Postal Ballots Trend: పోటెత్తుతున్న పోస్టల్ బ్యాలెట్లు, ఉద్యోగులు రేపు కూడా నేరుగా ఓటేయొచ్చు..-the postal ballots that are pouring in the employees can directly vote tomorrow too ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Postal Ballots Trend: పోటెత్తుతున్న పోస్టల్ బ్యాలెట్లు, ఉద్యోగులు రేపు కూడా నేరుగా ఓటేయొచ్చు..

Postal Ballots Trend: పోటెత్తుతున్న పోస్టల్ బ్యాలెట్లు, ఉద్యోగులు రేపు కూడా నేరుగా ఓటేయొచ్చు..

Sarath chandra.B HT Telugu
May 08, 2024 09:08 AM IST

Postal Ballots Trend: ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు ముందే పోస్టల్ బ్యాలెట్లు పోటెత్తుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి తరలి వస్తున్నారు.

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఈసీ సీఈఓ ముఖేష్‌ కుమార్ మీనా
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఈసీ సీఈఓ ముఖేష్‌ కుమార్ మీనా

Postal Ballots Trend: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల సరళి రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతోంది. ఎన్నికల సంఘం సంస్కరణల్లో భాగంగా అత్యవసర సేవల్లో ఉండే వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడంతో పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేసుకున్నారు. మే 1వరకు పోస్టల్ బ్యాలెట్‌ రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పించడంతో ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బందితో పాటు ఇతర అత్యవసర క్యాటగిరీల వారు కూడా ఓటు వేసేందుకు రిజిస్టర్ చేసుకున్నారు.

మంగళవారం వరకు ఏపీలో దాదాపు 3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కూడా ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉన్నా ఈ స్థాయిలో ఉద్యోగులు ఓట్లు వేసిన దాఖలాలు లేవు.

గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉండేది. ఎన్నికల విధుల శిక్షణా సమయంలోనే పోస్టల్ బ్యాలెట్లు వేసేవారు. దీంతో ఎక్కువ మంది ఓటు వేయలేకపోతున్నారని గుర్తించిన ఈసీ ఈ సారి అన్ని జిల్లాల్లో ఫెలిసిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీంతో ఉద్యోగులు తమ ఓటు హక్కు ఎక్కడ ఉన్నా పనిచేసే చోట దానిని వినియోగంచుకునే అవకాశం లభించింది. ఎన్నికల విధులకు సంబంధించిన డ్యూటీ ఆర్డర్‌, ఓటరు కార్డులను చూపించి ఓటు వేసేలా ప్రోత్సహించారు.

పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకున్న వారు సొంత జిల్లాలో ఓటు వేయాలంటే సంబంధిత ఆర్వో కేంద్రంలో నేరుగా ఓటు వేయడానికి వీలు కల్పించారు. ఇతర జిల్లాల్లో ఉన్న ఓటను వినియోగించడానికి రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసీ డ్యూటీ ఆర్డర్‌ను అయా కేంద్రాల్లో గెజిటెడ్‌ అధికారులు ధృవీకరించిన తర్వాత అసెంబ్లీ, లోక్‌సభ ఓట్లను బ్యాలెట్ పత్రాల ద్వారా వేసేందుకు అనుమతిస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీగా ఓట్లు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

మంగళవారానికి రాష్ట్ర వ్యాప్తంగా 3.3లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకుంటే వారిలో 2.76లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఎన్నికల విధులు, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గురువారం కూడా పోస్టల్ బ్యాలెట్‌ వినియోగించుకోడానికి ఈసీ అనుమతించింది. మరోవైపు గడ్చిరోలిలో ఎన్నికల విధుల కోసం వెళ్లిన ఏపీఎస్సీ బెటాలియన్లకు చెందిన పోలీసులు 10వ తేదీన తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధుల నుంచి తిరిగి క్యాంపులకు రావడానికి గడువు కావాలని 10న కూడా ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.

2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.38లక్షల పోస్టల్ బ్యాలెట్లు వినియోగిచుకున్నారు. ఆ సంఖ్యను ఇప్పటికే అధిగమించారు. నేడు, రేపు కూడా పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఉండటం, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నేరుగా ఓటు వేయాల్సిన ఆర్వో కేంద్రాల్లో స్పాట్‌ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో ఓట్ల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనడం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉద్యోగుల్ని ప్రలోభ పెడితే చర్యలు…

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ వేయడానికి ప్రలోభ పెడితే కఠిన చర్యలు తప్పవని ఈసీ సీఈఓ మీనా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ధరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

కొన్ని జిల్లాల్లో 3 వ తేదీన మరికొన్ని జిల్లాల్లో 4 వ తేదీన హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం అయిందన్నారు. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాట్లకు సంబందించి కొన్ని సమస్యలు తతెత్తిన వెంటనే వాటిని పరిష్కరించామని చెప్పారు.

ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్ కోసం ధరఖాస్తు చేసుకున్న4.30 లక్షల మందిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్ ఓటింగ్ కేటగిరీ క్రింద 28 వేల మంది, ఎసెన్షయల్ సర్వీసెస్ కేటగిరీ క్రింద 31 వేల మంది మరియు మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకూ 2.76 లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లలోను మరియు హోమ్ ఓటింగ్, ఎసన్షియల్ సర్వీసెస్ కేటగిరీ క్రింద 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు.

కొంత మంది ఉద్యోగులు పలు రకాల కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోనందున సంబందిత ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలోనైతే ఓటు కలిగి ఉన్నాడో ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో స్పాట్ లోనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా నేడు, రేపు కూడా అవకాశాన్ని కల్పించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోని ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలో ఓటు హక్కును కలిగి ఉన్నాడో ఆ ఆర్వోను నేనుగా కలసి సంబందిత ఫెసిలిటేషన్ సెంటర్లో స్పాట్ లోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును నేడు, రేపు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు..

పోస్టల్ బ్యాలెట్ వినియోగం విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చేవారిపైనే కాకుండా లంచాలు పుచ్చుకునే వారిపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేశామన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించి అతనిని సస్పెండ్ చేశామన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఇద్దరు నగదుతో తిరగడాన్ని గుర్తించి నగదను సీజ్ చేసి వారిని అరెస్టు చేసి, ఎఫ్.ఐ.ఆర్. ను ఫైల్ చేశామని, ఒంగోలులో కొంత మంది యుపిఐ విదానం ద్వారా కొంత మంది ఉద్యోగులకు నగదు పంపించడం గుర్తించామన్నారు. వీటిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, సంబందిత జిల్లా ఎస్పీని సమగ్ర విచారణ చేయాలన ఆదేశించడం జరిగిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం