Pawan Kalyan Pithapuram Majority : పిఠాపురంలో పవన్ కల్యాణ్ దే గెలుపు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు- భారీ మెజార్టీ సాధ్యమేనా?
02 June 2024, 14:16 IST
- Pawan Kalyan Pithapuram Majority : ఏపీలో మరో రెండ్రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూటమి, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చాయి. పిఠాపురంలో మాత్రం పవన్ దే గెలుపని స్పష్టం చేస్తున్నాయి.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ దే గెలుపు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
Pawan Kalyan Pithapuram Majority : రాష్ట్రంలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. ఇంకా ఫలితాలే తరువాయే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అయితే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ వన్ సైడ్ గా రాలేదు. అధికార, ప్రతిపక్షాల్లో ఏ ఒక్కరికీ అనుకూలంగా రాలేదు. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా రాగా, మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. అలాగే మరోవైపు ఆయా పార్టీలకు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా మెజార్టీకి అంచున ఇచ్చాయి. దీంతో ఆయా పార్టీల నేతలు ఆనందంగా లేరు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ పై ఆయా పార్టీల నేతల స్పందన కూడా లేదు. అందువల్ల పార్టీ నేతల్లో స్తబ్దత నెలకొంది.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం, పవన్ కల్యాణ్ పైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదే స్పష్టమైంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ పవన్ గెలుపుపైనే జోస్యం చెప్పాయి. ఆయన గెలుపు సునాయాసమేనని అంటున్నాయి. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుస్తారని చెప్పారు. అయితే కొంత మంది భారీ మెజార్టీతో పవన్ గెలుస్తారని చెప్పగా, మరికొందరు పవన్ మెజార్టీ గురించి చెప్పకుండా పవన్ గెలుపునే ప్రస్తావించారు.
జనసైనికులు ఏం చెబుతున్నారు?
ఎగ్జిట్ పోల్స్ ఎలా చెప్పినప్పటికీ, మొదటి నుంచి జనసైనికులు మాత్రం పవన్ కల్యాణ్ కు లక్ష మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. అయితే ఎన్నికలు మధ్యలోకి వచ్చే సరికి, పవన్ కళ్యాణ్ కు లక్ష ఓట్లు మెజార్టీ రాదని, 60 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని జనసైనికులు అన్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంత భారీ మెజార్టీ రాకపోవచ్చనే కథనాలు వస్తున్నాయి. అదీకాక పిఠాపురంలో అంత భారీ మెజార్టీ ఇప్పటి వరకు ఎవ్వరికీ రాలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ సీటు దక్కకపోవడంతో మనస్తాపనకు చెందిన వర్మ, ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆయన ఏడ్చుకుంటూ టీడీపీ జెండాలు కాల్చుతూ ప్రచారం చేశారు. సానుభూతి సాధించిన వర్మ, 40 వేల పైచిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇదే భారీ మెజారిటీ. అయితే ఈ మెజారిటీని పవన్ కల్యాణ్ క్రాస్ చేస్తారా? లేదా? చూడాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ కు పది వేలు వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి వంగాగీత కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1,500 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని వైసీపీ అభ్యర్థి వంగాగీత చెబుతున్నారు.
ఓటింగ్ సరళి
పిఠాపురంలో పోలింగ్ సరళిని చూస్తే, గతం కంటే భారీగా ఓటింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అయింది. ఏకంగా 86.63 శాతం పోలింగ్ జరిగింది. ఇదే పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92 శాతం పోలింగ్ జరిగింది. ఐదు శాతానికి పైబడి పోలింగ్ పెరిగింది. ఇదే పిఠాపురంలో 2014 ఎన్నికల్లో 79.44 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత రెండు ఎన్నికలతో పోల్చితే, ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 2,38,500 ఓట్లకు గాను, 2,00,000 ఓట్లు పాలైయ్యాయి. అందులో 65 వేలు కాపు ఓట్లు పోలవ్వగా, 38 వేలు ఎస్సీ, 80 వేలు బీసీ, 11 వేలు రెడ్డి, 4 వేలు వైశ్య, బ్రహ్మణ, 2 వేలు ముస్లిం ఓట్లు పోలయ్యాయి. వీటీలో కాపు, వైశ్య, బ్రహ్మణ ఓట్లు ఎక్కువ శాతం జనసేనకు పడే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, రెడ్డి ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉంది. దీనిబట్టీ ఎవరు గెలిచినా భారీ మెజార్టీ ఉండదనిపిస్తుంది.
అయితే జూన్ 4 అంటే మంగళవారం ఓట్లు లెక్కింపు జరగనుంది. అప్పుడు పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుస్తారా? లేక వంగాగీత గెలుస్తారా? అని తేలుతుంది. గెలిచిన వారికి మెజార్టీ ఎంత వస్తుందో స్పష్టం అవుతుంది. మరోవైపు వైసీపీ గెలిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని, కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయా పార్టీలు ప్రకటించేశాయి. మొత్తానికి 2024 ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠంగా ఉన్నాయని స్పష్టం అవుతుంది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు