Pithapuram Election Result 2024 : అధ్యాత్మిక కేంద్రం 'పిఠాపురం' పీఠం ఎవరిది...?-who will win in pithapuram assembly constituency election 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pithapuram Election Result 2024 : అధ్యాత్మిక కేంద్రం 'పిఠాపురం' పీఠం ఎవరిది...?

Pithapuram Election Result 2024 : అధ్యాత్మిక కేంద్రం 'పిఠాపురం' పీఠం ఎవరిది...?

HT Telugu Desk HT Telugu
May 31, 2024 06:16 PM IST

Pithapuram Election Result 2024 : పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు జనసేన, మరోవైపు వైసీపీ శ్రేణులు సవాళ్లు విసురుకుంటున్నాయి. జూన్ 4వ తేదీన నేతల భవితవ్యం తేలనుంది.

పిఠాపురంలో గెలుపు ఎవరిది..?
పిఠాపురంలో గెలుపు ఎవరిది..?

Pithapuram Election Result 2024 : ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.‌ తమదే గెలుపు‌ అంటూ అధికార వైఎస్ఆర్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి లెక్కలేసుకుంటున్నాయి. సర్వే సంస్థలు గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎవరికి తోచిన లెక్కలు వారు చెబుతున్నారు. కొన్ని సంస్థలు వైఎస్ఆర్ సీపీదే మళ్లీ పీఠం అంటూ చెబుతుంటే, మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అంటూ ప్రకటిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ రేపు (శనివారం) సాయంత్రం విడుదల కానున్నాయి. ఆ సంస్థలు ఎలా చెబుతాయో చూడాలి.

పిఠాపురంపై అందరిచూపు…..

ఇదిలా ఉంటే రాష్ట్రంలో‌ ఉమ్మడి తూర్పు ‌గోదావరి జిల్లాలోని పిఠాపురంపైనే అందరి చూపు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక కేంద్రమైన పిఠాపురంపై గతంలో ఎన్నడూ లేనంత చర్చ జరుగుతుంది. పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వంగాగీత గెలుస్తుందా? లేక కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన‌ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారా? అని చర్చ జరుగుతుంది. అయితే ఎక్కువ మంది మాత్రం పవన్ కళ్యాణే గెలుస్తారని అంటున్నారు. అయితే వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వంగాగీతను కూడా తక్కువ అంచన వేయొద్దని అంటున్నారు.

గత 2019 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓటమి చవి చూశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంపై కన్నేశారు.‌ అందుకు కారణం పిఠాపురం నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధిక మంది కాపులు ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్న పిఠాపురంలో బరిలోకి దిగారు. దీంతో అందరి చూపు పిఠాపురంపై పడింది. అధికార వైసీపీ తరపున ప్రస్తుత ఎంపి వంగా గీత పోటీ చేయడంతో పిఠాపురంలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.‌ ప్రజాదరణ ఉన్న వంగాగీత, సినీ పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఎక్కడ చూసిన పిఠాపురంపైనే చర్చ సాగింది.

ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్ కు సవాల్ గా మారాయి. అందుకే సేఫ్ సైడ్ గా పిఠాపురాన్ని ఎంచుకున్నారు పవన్. ఈ ఎన్నికలు పవన్ కు ఎందుకు కీలకమంటే, ఒకవేళ ఈ ఎన్నికల్లో పవన్ ఓటమి చెందితే, పవన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. విజయం సాధిస్తే కాస్తా ఊపిరి పీల్చుకోవచ్చు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత గెలిస్తే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఆమె ఇప్పటికే సీనియర్ మహిళ నేతగా జిల్లాలో పేరు పొందింది. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏకంగా డిప్యూటీ సిఎం అయ్యే అవకాశం ఉంది. ఆమె గెలిస్తే డిప్యూటీ సిఎంను చేస్తానని వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో జరిగి‌న బహిరంగ సభలోనే హామీ ఇచ్చారు. గెలుపు… ఆమెకు వరంగా మారనుంది.

జనసేన అధినేత విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ గెలిచి‌నప్పటికీ, టీడీపీ అధినేత చంద్రబాబు తలిస్తేనే డిప్యూటీ సిఎం అయ్యే అవకాశం ఉంది. అయితే జనసైనికులు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇటు టీడీపీ నుంచి గాని, అటు జనసేన నుంచి గాని పవన్ కు డిప్యూటీ సీఎం పదవిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

న్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో‌ పవన్ కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ను సదురు టీవీ ఛానల్ యాంకర్ ప్రశ్నించగా, చంద్రబాబు నాయుడు, టీడీపీ నిర్ణయిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, ఏపీ.

సంబంధిత కథనం