FIR on Sajjala: సజ్జలపై కేసు నమోదు, కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టారని టీడీపీ లీగల్‌ సెల్ ఫిర్యాదు-tdp legal cell complained that a case was registered against sajja and the counting agents were provoked ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Fir On Sajjala: సజ్జలపై కేసు నమోదు, కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టారని టీడీపీ లీగల్‌ సెల్ ఫిర్యాదు

FIR on Sajjala: సజ్జలపై కేసు నమోదు, కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టారని టీడీపీ లీగల్‌ సెల్ ఫిర్యాదు

Sarath chandra.B HT Telugu
May 31, 2024 09:56 AM IST

FIR on Sajjala: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ సందర్భంగా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే గట్టిగా నిలదీయాలని సూచించడంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు

FIR on Sajjala: వైసీపీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణనిచ్చే సమయంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల మాట్లాడారని ఫిర్యాదు చేశారు. IPC లోని u/s 153, 505 (2) IPC, 125 RPA 1951 కింద కేసు నమోదు చేశారు.

yearly horoscope entry point

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణనిచ్చే సమయంలో గట్టిగా ప్రశ్నించలేని వారు ఏజెంట్లుగా వద్దని, నిబంధనల పేరుతో అడ్డుకునే వారిని గట్టిగా నిలదీయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సజ్జలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.

బుధవారం తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల మాట్లాడారు. ఏజెంట్లతో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. “మన టార్గెట్ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని... దానికి అవసరమైనవి తెలుసుకోవాలని, ప్రత్యర్థి పార్టీలను అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలని సూచించారు. మనవి(వైసీపీ) ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలని, అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని కూర్చోకూడదని సూచించారు.

వైసీపీకి అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా నిబంధనలు ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు బాగా ఎక్కించాలన్నారు.

పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదని రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా నియమించ వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లు సృష్టిస్తే ఏ పార్టీ వారైనా బయటకు పంపుతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కౌంటింగ్ అడ్డుకునే వారిపై అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని సీఈఓ మీనా స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం