Peddireddy On Nallari: నల్లారిపై పెద్దిరెడ్డి ఫైర్.. రాష్ట్ర విభజనకు కిరణ్‌కుమార్ రెడ్డే కారణమని ఆగ్రహం
05 April 2024, 12:36 IST
- Peddireddy On Nallari: మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డినే కారణమని ఆరోపించారు.
మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
Peddireddy On Nallari: రాష్ట్రానికి ప్రత్యేక హోదా Special category Status రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం Ex CM కిరణ్ కుమార్ రెడ్డే Kiran Kumar Reddy నని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారన్నారు. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని వేధించాడని మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి అని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రారంభించారు. పుంగనూరు మండలంలోని ఆరడిగుంట నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 12 పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయని చెప్పారు. విద్య, వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం ఖర్చు చేసే పరిస్థితి లేకుండా సిఎం జగన్ బాధ్యత తీసుకున్నారన్నారు.
సిఎంగా వైఎస్ జగన్‌ను మళ్ళీ గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒకే కుటుంబం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని చంద్రబాబును పెద్దిరెడ్డి విమర్శించారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించామన్నారు. త్వరలోనే నియోజక వర్గంలో ఇంటింటికీ కుళాయి ద్వారా నీటిని అందిస్తామన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిని, పుంగనూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలన్నారు.
రాజంపేటలో గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామన్నారు. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌ను రాజకీయంగా కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని ఆరోపించారు.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాక పోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు నిస్సిగ్గుగా బిజెపిలో చేరారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తమ ప్రాంతానికి నీరు కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ విజయానికి అంతా కృషి చేయాలన్నారు.