Ysrcp Mla Adimulam : సైకిల్ పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇన్ని ఆస్తులెలా వచ్చాయ్-వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు
Ysrcp Mla Adimulam : మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి పెద్దిరెడ్డే కారణమన్నారు.
Ysrcp Mla Adimulam : తిరుపతి ఎంపీ అభ్యర్థిగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేరును వైసీపీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ టికెట్ ను కోనేటి ఆదిమూలం నిరాకరించారు. తనకు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో క్రమశిక్షణ, విశ్వసనీయత లేదంటూ విమర్శించారు. సొంత పార్టీ నేతలే తనను హింసించారని ఆవేదన చెందారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పట్ల ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2 నెలలుగా చిత్రహింసలు
‘‘ఈ విషయాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్‌తో మాత్రమే చర్చించాను. నేను 2 నెలలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నాను. నారాయణ్ మండలం నా సొంత గ్రామం అయితే నన్ను తిరుపతి ఎంపీగా ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించాను. నాకు ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని, ప్రజలకు సేవ చేయడంలో నిరూపించుకుంటానని సీఎంను వేడుకున్నాను. అయినప్పటికీ, జగన్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని పట్టుబట్టారు."- ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
సైకిల్ పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇన్ని ఆస్తులు ఎక్కడివి?
నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ ఛార్జ్ గా ప్రకటించారని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా స్థానాల్లో మార్పులు చేయలగలరా? అని నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా? అని మండిపడ్డారు. సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ అక్రమాలకు తనని బాధ్యుడు చేసి నియోజకవర్గం నుంచి నన్ను తప్పించారని ఆరోపించారు. 30 ఏళ్ల క్రితం మోటారు సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి ఆస్తుల చిట్టా బయటపడుతుందన్నారు. పెద్దిరెడ్డే తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలు చెప్పాలన్నారు. సత్యవేడు ప్రశాంతమైన నియోజకవర్గమన్నారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష నేతల్లో ఎవరిపైనా కేసులు లేవన్నారు.
చిత్తూరు వైసీపీలో టికెట్ల లొల్లి
చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ మార్పులు చేసింది. దీంతో తన స్థానంపై భరోసా కోసం ఇటీవల మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు ఎమ్మెల్యే ఆదిమూలం. అయితే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు మొక్కారు. ఈ ఫొటో వైరల్ అయ్యింది. సీఎం జగన్‌పై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధిష్ఠానం తనకు సీటు నిరాకరించడంతో ఆవేదనను బయటపెట్టారు. సీఎం జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తన వల్ల ఎలా అవుతుందన్నారు. తాను ఏం తప్పు చేశానో పిలిచి చెప్పాలన్నారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఎం.ఎస్.బాబు ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తర్వాత సీఎం జగన్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మాటమార్చారు.