Arani Srinivasulu In JSP: జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు
27 March 2024, 11:52 IST
- Arani Srinivasulu In JSP: వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో భేటీ అయినందుకు వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులు
Arani Srinivasulu In JSP: వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు Arani Srnivasulu జనసేన పార్టీలో చేరారు. రాజ్యసభకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించినా చివరి నిమిషంలో మొండి చేయి చూపడంతో ఆరణి శ్రీనివాసులు అసంతృప్తికి గురయ్యారు. అంతకు ముందు ఏపిఐఐసి ఛైర్మన్ పదవి విషయంలో అలాగే చేశారని ఉద్దేశపూర్వకంగానే జిల్లాకు చెందిన ఇతర నేతలు పదవి దక్కకుండా అడ్డు పడ్డారని భావించిన ఆరణి శ్రీనివాసులు వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ Pawan Kalyan సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ నుంచీ ఆరణి శ్రీనివాసులు తెలుసని పవన్ కళ్యాణ చెప్పారు. జనసేనలో తనతో కలిసి ప్రయాణిస్తానని శ్రీనివాసులు చెప్పారని, చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయిందని పవన్ చెప్పారు.
వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలతో తనకు విభేదాలు లేవని రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయిందన్నారు. కర్నూలులో సుగాలి ప్రీతి హత్య నన్ను కలిచివేసిందని జనసేన ఒత్తిడి వల్లే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇచ్చారన్నారు. రాయలసీమ ప్రాంతం.. కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుందని రౌడీయిజానికి మారుపేరుగా రాయలసీమ నిలిచిందన్నారు.
రాయలసీమలో కొందరు నేతలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదని రాయలసీమ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, బానిస సంకెళ్లతో ఎన్నాళ్లు ఉంటారో రాయలసీమ వాసులు ఆలోచించాలన్నారు.
డబ్బు, కుుటుంబం అన్నీ వదులుకుని ప్రజల బాగు కోసం వచ్చానని, రాయలసీమలో ఈసారి అణగారిన వర్గాలకు అండగా ఉందామన్నారు. చిన్న కులాల్లో ఐక్యత లేకే జగన్ మనుషులకు ఊడిగం చేస్తున్నారని భయం వదిలేస్తేనే రాయలసీమలో పరిస్థితులు మారతాయన్నారు. వైసీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
నిన్న మొన్నటి వరకు సీట్ల కేటాయింపు విషయంలో సలహాలు ఇచ్చిన వారంతా ఇతర పార్టీల్లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు కనీసం సీట్ల కేటాయింపు కూడా తెలియదని వారుభావించారని,తనకు సలహాలు ఇచ్చిన వాళ్లంతా ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లారని ముద్రగడను ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు.
వైసీపీని వీడుతున్న అసంతృప్త ఎమ్మెల్యేలు…
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) గత ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో భేటీ అయ్యారు. నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ల మార్పుచేర్పుల్లో చిత్తూరు అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. నియోజక వర్గానికి కొత్త అభ్యర్ధిని ఎంపిక చేసిన సమయంలో ఆరణికి రాజ్యసభ ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మొండి చేయి చూపారు.
దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు... ఆ పార్టీని విడేందుకు నిర్ణయించుకుని పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అవ్వడంతో వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్(AP Assembly Elections) రానుంది. దీంతో టికెట్ ఆశించిన నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత పార్టీలో టికెట్ రాదని ఫిక్స్ అయిన నేతలు... పక్క పార్టీల వైపు చూస్తున్నారు.
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టికెట్లు రాని వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.ఆరుగురు ఎంపీలు ఆ పార్టీని విడారు. ఐదుగురు లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీ వైసీపీని(Ysrcp) విడారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీని విడారు.