AP Rajyasabha Nominations: ముగ్గురు వైసిపి రాజ్యసభ అభ్యర్ధుల నామినేషన్లు ఆమోదం.. ఎన్నికల లాంఛనం-nominations of three ycp rajya sabha candidates approved ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rajyasabha Nominations: ముగ్గురు వైసిపి రాజ్యసభ అభ్యర్ధుల నామినేషన్లు ఆమోదం.. ఎన్నికల లాంఛనం

AP Rajyasabha Nominations: ముగ్గురు వైసిపి రాజ్యసభ అభ్యర్ధుల నామినేషన్లు ఆమోదం.. ఎన్నికల లాంఛనం

Sarath chandra.B HT Telugu

AP Rajyasabha Nominations: ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను అమోదించారు. స్వతంత్ర అభ్యర్ధికి ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో దానిని తిరస్కరించారు.

ఏపీ రాజ్యసభ నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులు

AP Rajyasabha Nominations: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు లాంఛనం కానున్నాయి. ఖాళీ అయిన మూడు స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో వారిని ఎన్నికల సంఘం అమోదంతో రాజ్యసభ సభ్యులుగా అమోదించనున్నారు.

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు వైసిపి తరపున నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు వెల్లడించారు.

శుక్రవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎంపి అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అభ్యర్ధుల తరుపున హాజరైన ప్రతినిధుల సమక్షంలో జరిగింది.

వైసిపి తరపున రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు,వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్లు పరిశీలించగా ముగ్గురు అభ్యర్ధు వారి నామినేషన్లతో అవసరమైన పలు డాక్యుమెంట్లన్నీ పూర్తి స్థాయిలో సక్రమంగా సమర్పించడంతో ఆముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు వెల్లడించారు.

స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణ…

స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా ఆయనకు కనీసం 10 మంది ఎంఎల్ఏల మద్ధత్తు కూడిన పత్రాన్ని సమర్పించకపోవడంతో నామినేషన్ల పరిశీలనలో ఆతని నామినేషన్ ను తిరస్కరించినట్టు ఆర్ ఓ విజయరాజు స్పష్టం చేశారు.

నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 20వ తేదీ వరకూ గడువు ఉన్నందున ఆరోజున ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి విజయరాజు పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమక్షంలో జరిగిన ఈ నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి,అభ్యర్ధుల తరిపున వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాతినిథ్యం కోల్పోయిన టీడీపీ…

టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిథ్యం కోల్పోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు విముఖత చూపడంతో ఆ పార్టీ తరపున ఎవరు నామినేషన్ వేయలేదు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలంతో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల పదవీ కాలం ముగిసింది.

టీడీపీకి 2019లో 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత నలుగురు పార్టీ ఫిరాయించారు. వైసీపీనుంచి మరో నలుగురు టీడీపీలో చేరారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో టీడీపీ బలం 18కు పరిమితం అయ్యింది. పార్టీ మారిన నలుగురిపై అనర్హత వేటు పడుతుందనే ప్రచారం, వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు కూడా లభించే అవకాశం లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాల్లో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి.

త్వరలో సాధారణ ఎన్నికలు జరుగనుండటంతో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వాటిపై పడకూడదనే ఉద్దేశంతోనే పోటీ నుంచి తప్పుకున్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే మళ్లీ రాజ్యసభలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.