Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేశ్ రికార్డు విజయం, నాలుగు దశాబ్దాల తర్వాత గెలుపు
04 June 2024, 21:57 IST
- Nara Lokesh : మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం జెండా ఎగురుతోంది.
మంగళగిరిలో నారా లోకేశ్ రికార్డు విజయం
Nara Lokesh : రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. అందులోనూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చరిత్రను సృష్టించారు. దశాబ్దాలుగా టీడీపీ ఓటమి చెందిన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ భారీ మెజార్టీతో గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91413 ఓట్ల మెజార్టీతో లోకేశ్ విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ 1985లో చివరిసారిగా గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. గత 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన లోకేశ్ ఓటమి చెందారు. అప్పటి నుండి ఆ నియోజకవర్గంలో నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ, పేదలకు తోపుడు బళ్లు వంటివి ఇస్తూ ముందుకు సాగారు లోకేశ్. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అయ్యారు. దాంతో ఈసారి ప్రజలు అక్కున చేర్చున్నారు.
1952 నుంచి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే టీడీపీ ఏర్పడిన 1983 నుంచి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ తొమ్మది ఎన్నికలలో టీడీపీ రెండు సార్లు మాత్రమే గెలిచింది. 1983, 1985ల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. టీడీపీ తరపున ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు. అప్పటి నుంచి ఏడు సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవి చూసింది. మళ్లీ ఇప్పుడు 2024లో టీడీపీ గెలిచింది. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరేసి లోకేశ్ చరిత్ర సృష్టించారు. మంగళగిరిలో 1989లో కాంగ్రెస్, 1994లో సీపీఎం, 1999, 2004, 2009ల్లో మళ్లీ కాంగ్రెస్, 2014, 2019ల్లో వైసీపీ విజయం సాధించగా, 2024లో టీడీపీ విజయం సాధించింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు